సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 23, 2020 , 09:20:31

దావూద్‌ పాక్‌లోనే.. తొలిసారి అంగీకరించిన దాయాది దేశం!

దావూద్‌ పాక్‌లోనే.. తొలిసారి అంగీకరించిన దాయాది దేశం!

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌ 88 నిషేధిత ఉగ్రవాద గ్రూపులు, వాటి నేతలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో దావుద్‌ ఇబ్రహీం తన గడ్డపై ఉన్నట్లు తొలిసారిగా అంగీకరించింది. ఉగ్రవాద గ్రూపుల జాబితాలో ఇబ్రహీం పేరుపై అధికారిక ధ్రువీకరణ లేకపోయినా, తాజాగా ఆంక్షలు విధించిన నాయకుల జాబితాలో దావుద్‌ పేరు ఉందని, ఆ దేశ మీడియా నివేదికలు బహిర్గతం చేశాయి. దీంతో అండర్‌ వరల్డ్‌ తన దేశంలోనే ఉన్నాడని ఇస్లామాబాద్ అంగీకరించడం ఇదే మొదటిసారి. ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితా నుంచి తప్పించుకునేందుకు హఫీజ్ సయీద్, మసూద్ అజహర్, ఇబ్రహీం సహా 88 నిషేధిత ఉగ్రవాద గ్రూపులపై, వాటి నేతలపై పాకిస్థాన్ శుక్రవారం కఠిన ఆర్థిక ఆంక్షలు విధించిందని, వారి ఆస్తులన్నింటినీ జప్తు చేసి, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు పాకిస్థాన్ పత్రిక ‘ద న్యూస్‌’ శనివారం వెల్లడించింది.

దావూద్‌ 1993 ముంబై బాంబు దాడుల కేసులో నిందితుడు. 2003లో అమెరికా ప్రత్యేకంగా నియమించిన గ్లోబల్ టెర్రరిస్టుగా ఇబ్రహీంను ప్రకటించింది. ఇబ్రహీంను భారత్‌కు అప్పగించాలని భారత్ పదేపదే పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది. ఇబ్రహీం దక్షిణ ఓడరేవు నగరమైన కరాచీ కేంద్రంగా పని చేస్తున్నట్లు సమాచారం. పారిస్ కేంద్రంగా పని చేసే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) 2018 జూన్‌లో పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. 2019 చివరి నాటికి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఇస్లామాబాద్‌కు సూచించింది.

అయితే కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా గడువును పొడగించారు. 26/11 ముంబై దాడి సూత్రధారి, జమాత్ ఉద్ దవా (జేయూడీ) చీఫ్ సయూద్, జైష్-ఎ-మహ్మద్ (జేఈఎం) చీఫ్ అజహర్, అండర్ వరల్డ్ డాన్ ఇబ్రహీం వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక వ్యక్తులపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఆగస్టు 18న రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది.  ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) విడుదల చేసిన కొత్త జాబితాకు అనుగుణంగా 88 మంది నేతలను, ఉగ్రవాద గ్రూపుల సభ్యులను పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధి౦చినట్లు ‘ద న్యూస్‌’ వెల్లడించింది. జమాత్ ఉద్ దవా (జేయూడీ), జేఈఎం, తాలిబన్, దేష్, హక్కానీ గ్రూప్, అల్ ఖైదా తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక వ్యక్తులపై ఈ నోటిఫికేషన్లు జారీ చేసింది.

ఈ సంస్థలు, వ్యక్తుల అన్ని చరాస్తులు, స్థిరాస్థులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని నివేదిక పేర్కొంది. ఆర్థిక సంస్థల ద్వారా డబ్బు బదిలీ చేయడం, ఆయుధాల కొనుగోలు, విదేశాలకు ప్రయాణించడాన్ని నిషేధించారని పేర్కొంది. పాకిస్థాన్‌-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో దాక్కున్న తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) అన్ని నాయకులు, సభ్యులపై పూర్తి నిషేధాన్ని ఈ నోటిఫికేషన్లు ఆమోదించాయి. ఆ పత్రికలో సయీద్, అజహర్, ముల్లా ఫజ్లుల్లా (అలియాస్ ముల్లా రేడియో), జకీవుర్ రెహమాన్ లఖ్వీ, మహ్మద్ యాహ్యా ముజాహిద్, అబ్దుల్ హకీమ్ మురాద్, ఉజ్బెకిస్థాన్ లిబరేషన్ మూవ్‌మెంట్‌కు చెందిన ఫజల్ రహీమ్ షా, తాలిబన్ నేతలు జలాలుద్దీన్ హక్కానీ, ఖలీల్ అహ్మద్ హక్కానీ, యాహ్యా హక్కానీ, ఇబ్రహీం, అతని సహచరులు ఈ జాబితాలో ఉన్నారు.

అలాగే టీటీఎఫ్‌ నాయకత్వం సహా లష్కర్-ఎ-తోయిబా, జేఈఎం, లష్కర్-ఎ-ఝాంగ్వి, టీటీఎఫ్‌ తారిఖ్ గీదార్ సమూహం, హర్కతుల్ ముజాహిద్దీన్, అల్ రషీద్ ట్రస్ట్, అల్ అక్తర్ ట్రస్ట్, టాంజిం జైష్-అల్ మొహజీరీన్ అన్సర్, జమాత్-ఉల్ అహ్రార్, తంజీం ఖుత్బా ఇమామ్ బుఖారీ, రబితా ట్రస్ట్ లాహోర్, రీవైవల్‌ ఇస్లామిక్ హెరిటేజ్ సొసైటీ ఆఫ్ పాకిస్థాన్‌, అల్-హరామెయిన్ ఫౌండేషన్ ఇస్లామాబాద్, హర్కత్ జిహాద్ అల్ ఇస్లామీ, ఇస్లామి జిహాద్ గ్రూప్, ఉజ్బెకిస్తాన్ ఇస్లామీ తెహ్రీక్ , ఇరాక్‌కు చెందిన డేష్, రష్యాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎమిరేట్స్ ఆఫ్ టాంజిమ్ ఖఫ్ఖాజ్, ఇస్లామిక్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్‌ ఆఫ్ చైనాకు చెందిన ఉయ్ ఘుర్‌లకు చెందిన అబ్దుల్‌ హక్‌లు నిషేధానికి గురయ్యారు. యుఎన్‌ఎస్‌సీ జాబితా చేసిన దాదాపు అన్నింటిపై వివిధ ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ, కొత్త నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వం గతంలో ప్రకటించిన చర్యలను ఏకీకృతం చేసి, డాక్యుమెంట్ చేసిందని నివేదిక తెలిపింది.

యూఎన్‌ఎస్‌సీ ఆంక్షల కమిటీ ఉగ్రవాదులుగా ప్రకటించిన సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలను విధిస్తోంది. పాకిస్థాన్‌తో సహా అన్ని రాష్ట్రాలు ఆస్తుల ఫ్రీజ్‌, ప్రయాణంపై నిషేధం వంటి ఆంక్షలు అమలు చేయని పరిస్థితి. ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్ట్‌ నుంచి బయటపడేందుకు తాజాగా చర్యలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఆగస్టు 12న, ప్రభుత్వం మరియు ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ధేశించిన కఠిన పరిస్థితులకు సంబంధించిన నాలుగు బిల్లులను పాక్‌ పార్లమెంట్‌ దిగువ సభ ఆమోదించింది. జూన్‌లో కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా మూడవ, చివరి ప్లీనరీలో, లష్కర్-ఎ-తోయిబా (ఎల్‌ఈటీ), జైష్-ఎ-మహ్మద్ (జేఈఎం) వంటి ఉగ్రవాద గ్రూపులకు డబ్బు ప్రవాహాన్ని అరికట్టడంలో ఇస్లామాబాద్ విఫలం కావడంతో పాకిస్థాన్‌ను గ్రే జాబితాలో ఉంచాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయించింది. చైనా ప్రెసిడెన్సీ ఆఫ్ జియాంగ్మిన్ లియు ఆధ్వర్యంలో ఈ ప్లీనరీ జరిగింది.

గ్రే జాబితాలో పాకిస్థాన్‌ కొనసాగడడంతో ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి ఆర్థిక సహాయం పొందడం దేశానికి కష్టమవుతుంది. తద్వారా దేశం ఆర్థిక పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అక్టోబర్ నాటికి ఎఫ్ఏటీఎఫ్ ఆదేశాన్ని పాకిస్థాన్ పాటించకపోతే, ఉత్తర కొరియా, ఇరా‌న్‌లతో పాటు ప్రపంచ సంస్థ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ అనేది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సమగ్రతకు మనీలాండరింగ్‌, తీవ్రవాద ఫైనాన్సింగ్‌,  ఇతర సంబంధిత బెదిరింపులను ఎదుర్కోవడానికి 1989లో స్థాపించబడిన ఒక అంతర ప్రభుత్వ సంస్థ. ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్రస్తుతం రెండు ప్రాంతీయ సంస్థలతో సహా 39 మంది సభ్యులను కలిగి ఉంది. అవి యూరోపియన్ కమిషన్‌, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo