ఆదివారం 29 నవంబర్ 2020
International - Oct 29, 2020 , 18:49:09

సైద్పూర్‌లో హిందూ దేవాలయాన్ని తెరవాలని పాక్ మత మండలి సిఫారసు

సైద్పూర్‌లో హిందూ దేవాలయాన్ని తెరవాలని పాక్ మత మండలి సిఫారసు

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌ దేశ రాజధాని నగరంలోని సైద్పూర్‌లో నిర్మించిన హిందూ దేవాలయాన్ని తెరువాలని పాకిస్తాన్‌కు చెందిన మత మండలి (కౌన్సిల్ ఆఫ్‌ ఇస్లామిక్‌ ఐడియాలజీ - సీఐఐ) సిఫారసు చేసింది. హిందూ దేవాలయాన్ని అభివృద్ధి పరిచే సమస్య ఇప్పుడు సీఐఐ పరిశీలనలో ఉన్నది. ''ఇస్లామాబాద్‌లో ప్రస్తుత జనాభా దృష్ట్యా సైద్పూర్ గ్రామంలోని పురాతన ఆలయం, దాని ప్రక్కనే ఉన్న ధర్మశాల హిందువులకు తెరవబడుతుంది. వారి నమ్మకాల ప్రకారం మతపరమైన సేవలు చేయడానికి వీలు కల్పించాలి" అని సీఐఐ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. వివాహ వేడుకలు నిర్వహించడానికి, హిందూ మతపరమైన ఆచారాలు నిర్వహించడానికి కమ్యూనిటీ సెంటర్‌తోపాటు శ్మశానవాటిక ఏర్పాటుకు స్థలం కేటాయించడానికి కూడా సీఐఐ సానుకూల ఆమోదం తెలిపింది. కౌన్సిల్ ఈ విషయాన్ని సుదీర్ఘంగా, లోతుగా సమీక్షించినందున మతపరమైన మతాధికారులు, హిందూ సమాజ ప్రతినిధులతో సహా వివిధ దరఖాస్తుదారుల నుంచి వాదనలు విన్న తరువాత సీఐఐ ఈ నిర్ణయం వచ్చినట్లు తెలిసింది.

ఇస్లామిక్ నిబంధనలు, చట్టాలను దృష్టిలో ఉంచుకుని.. అనధికారిక ఆరాధనా స్థలాల కోసం ప్రభుత్వ నిధులను కేటాయించలేమని కౌన్సిల్ అభిప్రాయపడింది. ఏదేమైనా, పాకిస్తాన్ పౌరులుగా, హిందూ సమాజ శ్రేయస్సు కోసం నిధులను కేటాయించవచ్చని తెలిపింది. ఇస్లామాబాద్ సెక్టార్ హెచ్-9 / 2 లో హిందూ దేవాలయం నిర్మాణానికి భూమి, నిధుల కేటాయింపును ఆమోదించడంతో ప్రస్తుత ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి, విమర్శలకు గురైంది. పలు మత సంస్థలు వీరి నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. 2017 లో అప్పటి నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం 2,400 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. అప్పటినుంచి ఈ నిర్ణయాన్ని చాలా మంది చట్టసభ సభ్యులు, మత సంస్థలు వ్యతిరేకించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.