శనివారం 30 మే 2020
International - May 18, 2020 , 13:56:00

ఉగ్రవాది కొమ్ముకాసిన పాక్ సంతతి బ్రిటన్ మంత్రి

ఉగ్రవాది కొమ్ముకాసిన పాక్ సంతతి బ్రిటన్ మంత్రి

లండన్: పరారీలో ఉన్న ఉగ్రవాది టైగర్ హనీఫ్‌ (57)ను తనకు అప్పగించాలని భారత్ చేసిన విజ్ఞాపనను బ్రిటన్ తిరస్కరించింది. బ్రిటన్ హోంశాఖ ఈ సంగతి ధ్రువీకరించింది. పాక్ సంతతికి చెందిన బ్రిటన్ మాజీ హోంమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారవర్గాల ద్వారా తెలిసింది. 1993లో సూరత్ లో జరిగిన రెండు బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసులో టైగర్ హనీఫ్ నిందితుడు. పరారీలో ఉన్న డాన్ దావూద్ ఇబ్రహీంకు టైగర్ సహాయకుడిగా ఉండేవాడు. సూరత్‌లోని వరచా రోడ్డులో ఉండే మార్కెట్‌లో 1993 జనవరిలో జరిగిన మొదటి పేలుడులో ఓ ఎనిమిదేళ్ల అమ్మాయి చనిపోయింది. 1993 ఏప్రిల్‌లో రెండో పేలుడు జరిగింది. వీటికి బాధ్యుడుగా భారత్ భావిస్తున్న టైగర్ హనీఫ్ పారిపోయి బ్రిటన్‌లో తేలాడు. 2010 ఫిబ్రవరిలో గ్రేటర్ మాంచెస్టర్ లోని బోల్టన్‌లో ఓ పచారీకొట్టులో అతడు స్కాట్లండ్ యార్డు పోలీసులకు పట్టుబడ్డాడు. భారత్‌లో తనను చిత్రహింసలకు గురిచేసే అవకాశం ఉందని వాదిస్తూ అప్పగింతను తప్పించుకుంటూ వస్తున్నాడు. 2012లో అప్పటి హోం మంత్రి థెరెసా మే హనీఫ్ అప్పగింతకు ఆదేశాలు జారీచేశారు. ఆ తర్వాత న్యాయపోరాటాలు మొదలయ్యాయి. చివరికి 2019లో అప్పటి హోం మంత్రి సాజిద్ జావిద్ భారత్ చేసుకున్న అప్పగింత విజ్ఞాపనను తిరస్కరించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే భారత్ తో బ్రిటన్‌కు గల నేరస్థుల అప్పగింత ఏర్పాటు రెండో తరగతికి చెందింది. అప్పగింత విషయంలో బ్రిటన్ హోంమంత్రికే పూర్తి అధికారం ఉండడం దీని ప్రత్యేకత. ఆ అధికారాన్ని ఉపయోగించుకునే సాజిద్ జావిద్ ఉగ్రవాది టైగర్ హనీఫ్‌ను ఆదుకున్నారు.


logo