శనివారం 06 జూన్ 2020
International - May 09, 2020 , 19:20:53

కరోనా విస్తరిస్తుంటే పాక్‌లో సడలింపులు అమలు

కరోనా విస్తరిస్తుంటే పాక్‌లో సడలింపులు అమలు

హైదరాబాద్: పాకిస్థాన్‌లో ఓవైపు కరోనా కేసులు ఏకబిగిన పెరుగుతుంటే మరోవైపు నెలరోజుల లాక్‌డౌన్ నిబంధనలను ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం శనివారం నుంచి సడలించింది. 24 గంటల్లో 1637 కరోనా కేసులు నమోదయ్యాయి, 24 మరణాలు సంభవించాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,474కు చేరుకున్నది. ఈ సంఖ్య ఇంకా పైపైకి పోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం తగ్గించేందుకు వ్యాపారాలు తిరిగి అనుమతించక తప్పదని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ గత గురువారం ప్రకటించారు. దశలవారీగా లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయని చెప్పారు.   అన్నట్టుగానే శనివారం తొలివిడత సడలింపులు అమలు చేశారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇమ్రాన్ ప్రతిపాదనలకు తలవూపాయి. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలవరకు వ్యాపారాలు చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతించింది. అలాగే నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ మసీదుల్లో రంజాన్ ప్రార్థనలు చేసుకుంటామని మతపెద్దలు పెట్టుకున్న అర్జీలకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే వైద్యులు, విపక్షాల నేతలు మాత్రం ఈ నిర్ణయాల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వానికి కరోనాపైగానీ, లాక్‌డౌన్‌పై గానీ ఓ విధానమంటూ ఉందా? అని మాజీ ప్రధాని షహీద్ ఖాకన్ అబ్బాసీ నిలదీశారు. వివిధ పరిశ్రమలు, వ్యాపారలను అనుమతించినప్పటికీ పాఠశాలలు మాత్రం జూలై 15 వరకు మూసే ఉంటాయి.


logo