ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 20:08:38

కుల్‌భూషణ్‌కు న్యాయవాది కోసం భారత్‌కు మరో అవకాశమిచ్చిన పాక్ కోర్టు

కుల్‌భూషణ్‌కు న్యాయవాది కోసం భారత్‌కు మరో అవకాశమిచ్చిన పాక్ కోర్టు

ఇస్లామాబాద్: కుల్‌భూషణ్ జాదవ్ తరఫున న్యాయవాదిని నియమించడానికి భారత్‌కు  మరో అవకాశం ఇవ్వాలని పాకిస్థాన్ కోర్టు ఆ దేశ  ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాదవ్‌కు విధించిన మరణశిక్ష రివ్యూ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషన్ జాదవ్ గూఢచర్యం, ఉగ్రవాదానికి పాల్పడినట్లు ఆరోపించిన పాక్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. కాగా, జాదవ్‌ను కిడ్నాప్ చేసిన పాక్ ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు భారత్ ఆరోపించింది. జాదవ్‌కు పాక్ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేయగా భారత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. జాదవ్‌కు విధించిన మరణ శిక్షపై సమీక్షించాలని, ఆయనను కలిసేందుకు భారత్‌కు దౌత్యపరంగా అవకాశం ఇవ్వాలని పేర్కొంది.

ఈ నేపథ్యంలో జాదవ్ మరణ‌శిక్ష రివ్యూ పిటిషన్‌పై విచారణకు ఆగస్టు 6న ఇస్లామాబాద్ హైకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి అధర్ మినల్లాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ కేసుపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా పాక్ అటార్నీ జనరల్ ఖలీద్ జావేద్ ఖాన్ భారత్‌పై పలు ఆరోపణలు చేశారు. జాదవ్ మరణశిక్ష సమీక్షపై తాము ఎన్ని సంప్రదింపులు జరిపినా ఆ దేశం స్పందించలేదని కోర్టుకు తెలిపారు. న్యాయ అవకాశాన్ని వినియోగించుకోవడంపై భారత్ శ్రద్ధ చూపడం లేదని, ఈ వ్యవహారంలో పాక్‌ను ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు.

అంతర్జాతీయ కోర్టు తీర్పు మేరకు జాదవ్ మరణ శిక్షపై పాక్ సమీక్ష జరిపేందుకు సిద్ధమైనప్పటికీ భారత్ మాత్రం సమీక్ష హక్కును అడ్డుకుంటున్నదని ఖాన్ కోర్టుకు తెలిపారు. దీంతో స్పందించిన ఇస్లామాబాద్ కోర్టు, కుల్‌భూషణ్ తరపున న్యాయవాదిని నియమించడానికి భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని, ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం భారత్‌కు తెలియజేయాలని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo