గురువారం 01 అక్టోబర్ 2020
International - Aug 25, 2020 , 21:39:29

ఇదీ ఓ పాకిస్తాన్ మాజీ రాయబారి నిర్వాకం

ఇదీ ఓ పాకిస్తాన్ మాజీ రాయబారి నిర్వాకం

జకర్తా : మరో పాకిస్తాన్ అధికారి నిర్వాకం బయటపడింది. ఇండోనేషియాలోని మాజీ పాక్ రాయబారి ఒకరు జకార్తాలోని ఎంబసీ భవనాన్ని అమ్మేశాడు. ఈ కేసు 19 సంవత్సరాల క్రితం నాటిది. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం.. దేశంలోని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (నాబ్) ఆగస్టు 19 న మాజీ అంబాసిడర్ మేజర్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ ముస్తఫా అన్వర్ పై ఫిర్యాదు చేసింది. అన్వర్ 2001-02లో జకర్తాలో పాక్ ఎంబసీ భవనాన్ని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈయన చర్యల వల్ల పాకిస్తాన్‌కు 13.2 మిలియన్ డాలర్లు (సుమారు 22 కోట్ల పాకిస్తాన్ రూపాయలు) నష్టం వాటిల్లింది.

అన్వర్ ప్రభుత్వానికి చెప్పకుండా, విదేశాంగ మంత్రిత్వశాఖ అనుమతి లేకుండా ఎంబసీ భవనాన్ని అమ్మకం కోసం ప్రకటన జారీ చేశారు. మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా రాయబారి భవనాన్ని విక్రయించలేరు. ఇండోనేషియాలో నియామకం తర్వాత జకార్తాలో భవనాన్ని విక్రయించే ప్రక్రియను అన్వర్ ప్రారంభించాడని నాబ్ ఆరోపించింది. ప్రక్రియ ప్రారంభమైన తరువాత అతను ఈ ప్రతిపాదనను మంత్రిత్వ శాఖకు పంపాడు. అయితే, విదేశాంగ మంత్రిత్వ శాఖ భవనం అమ్మకాన్ని నిషేధించింది. 

సుప్రీంకోర్టు వారిని మందలించిన తరువాత ఈ చర్యను నాబ్ తీసుకుంది. అవినీతి కేసు ఆలస్యంపై.. సుప్రీంకోర్టు గత వారం నాబ్ అధికారులను అనర్హులుగా పేర్కొంది. ట్రైబ్యూన్ నివేదిక ప్రకారం.. సరైన విచారణ నిర్వహించడానికి నాబ్ అధికారులకు అవసరమైన సామర్థ్యం లేదని చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ పేర్కొన్నారు.


logo