గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 10:41:17

మిలియ‌న్ల డాల‌ర్ల ట్యాక్స్ క‌ట్టా: ట్రంప్‌

మిలియ‌న్ల డాల‌ర్ల ట్యాక్స్ క‌ట్టా:  ట్రంప్‌

హైద‌రాబాద్‌: మిలియ‌న్ల డాల‌ర్ల‌లో ఆదాయ‌ప‌న్ను చెల్లించిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.  క్లీవ్‌ల్యాండ్‌లో అధ్య‌క్ష అభ్య‌ర్థుల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంలో ట్రంప్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.  న‌వంబ‌ర్ 3వ తేదీన జ‌ర‌గ‌నున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇవాళ తొలి ప్రెసిడెన్షియ‌ల్ డిబేట్ జ‌రిగింది. రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా ట్రంప్‌, డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా బైడెన్ పోటీప‌డుతున్నారు.  అయితే ఇటీవ‌ల ట్రంప్ ఆదాయ‌ప‌న్నుపై న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక ఓ క‌థ‌నం రాసింది.  ట్రంప్ 2016లో కేవ‌లం 750 డాల‌ర్లు మాత్ర‌మే ట్యాక్స్ రూపంలో చెల్లించార‌ని పేర్కొన్న‌ది. ఆ త‌ర్వాత ఏడాది వైట్‌హౌజ్ నుంచి కూడా ట్రంప్ అంతా మొత్తాన్ని క‌ట్టిన‌ట్లు వెల్ల‌డించింది. గ‌డిచిన 15 ఏళ్ల‌లో ప‌దేళ్లు ట్రంప్ ఎటువంటి ట్యాక్స్‌ను క‌ట్ట‌లేద‌ని కూడా ఆ ప‌త్రిక పేర్కొన్న‌ది. 

డిబేట్ స‌మ‌యంలో మాడ‌రేట‌ర్ క్రిస్ వాలెస్ ఈ అంశం గురించి ట్రంప్‌ను అడిగారు.   ట్యాక్సుల రూపంలో ఎంత చెల్లించార‌ని ప్ర‌శ్న అడ‌గా.. మిలియ‌న్ల డాల‌ర్ల‌లో ట్యాక్స్ క‌ట్టాను, మిలియ‌న్ల డాల‌ర్ల ఇన్‌కం ట్యాక్స్ చెల్లించిన‌ట్లు ట్రంప్ చెప్పారు.  నిజానికి త‌న‌కు ట్యాక్స్ క‌ట్టాల‌ని లేద‌ని, త‌న‌లాంటి ప్రైవేటు ఇన్వెస్ట‌ర్లు ఇలాంటి వాటిని ఇష్ట‌ప‌డ‌రు అని తెలిపారు. డిబేట్‌లో పాల్గొన‌డానికి ముందే ట్రంప్ త‌న ట్విట్ట‌ర్‌లో ట్యాక్స్ అంశం గురించి ట్వీట్ చేశారు.  మిలియ‌న్ల డాల‌ర్ల ట్యాక్స్ క‌ట్టాన‌ని, కానీ అంద‌రిలాగే ట్యాక్స్ క్రెడిట్స్ పొందిన‌ట్లు చెప్పారు. త‌న ఆస్తుల‌తో పోలిస్తే త‌న‌కు ఉన్న రుణం చాలా త‌క్కువ అని ఆయ‌న వెల్ల‌డించారు. 


logo