ఆక్స్ఫర్డ్ టీకా భేష్

- కరోనాకు 70% సమర్థంగా అడ్డుకట్ట
- ఫేజ్-3 మధ్యంతర ఫలితాలు వెల్లడి
- త్వరలోనే అత్యవసర వినియోగానికి దరఖాస్తు
- ఇప్పటికే 10 కోట్ల డోసులకు ఆర్డర్లు
- తక్కువ ధరకే అందించనున్న ఆక్స్ఫర్డ్
లండన్, నవంబర్ 23: కరోనా వ్యాక్సిన్ రేసు ఊపందుకుంది. ఇప్పటికే ఫైజర్, మోడర్నా టీకాల ఫలితాలు వెలువడగా.. తాజాగా బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తమ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కు సంబంధించిన మధ్యంతర ఫలితాలను ప్రకటించింది. కరోనాను తమ టీకా సమర్థంగా అడ్డుకుంటున్నట్టు వెల్లడించింది. రెండు డోసుల ఫలితాల్ని కలిపి పరిశీలిస్తే సగటున 70.3 శాతం మేర రక్షణ కల్పిస్తున్నట్టు తెలిపింది. ఇందులో ఒక డోస్ 90%, మరో డోసు 62% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. ఇప్పటికే 10 కోట్ల డోసులకు ఆర్డర్లు వచ్చాయని, అంతా సవ్యంగా సాగితే వచ్చేనెల్లో టీకా ఉత్పత్తి ప్రారంభిస్తామని బ్రిటన్ వైద్యశాఖ మంత్రి హాన్కాక్ తెలిపారు.
భారత్‌లో కొనసాగుతున్న ట్రయల్స్
అస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ ఈ టీకాను అభివృద్ధి చేస్తున్నది. ట్రయల్స్‌లో 20 వేల మంది వలంటీర్లు పాల్గొన్నారు. వలంటీర్లకు రెండు హై డోసులు ఇవ్వగా టీకా 62 శాతమే సమర్థత కనబరిచిందని, అదే ఒక లో డోస్, ఆ తర్వాత హై డోస్ ఇవ్వగా 90% సమర్థంగా పనిచేసినట్టు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ వెల్లడించారు. టీకా అత్యవసర అనుమతుల కోసం త్వరలోనే దరఖాస్తు చేస్తామన్నారు. భారత్, అమెరికా, కెన్యా, జపాన్‌లో ఆక్స్ఫర్డ్ టీకా ట్రయల్స్ కొనసాగుతున్నాయి.
ఫ్రీజర్లు అవసరం లేదు
కరోనా వ్యాక్సిన్ నిల్వపై సవాళ్లు ఎదురుకానున్నాయని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అయితే తమ టీకాకు ఫ్రీజర్లు అవసరం లేదని, సాధారణ రిఫ్రిజరేటర్లలో నిల్వ చేయవచ్చని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. తద్వారా వ్యాక్సిన్‌ను సులభంగా నిల్వ, సరఫరా చేసేందుకు వీలవుతుందని తెలిపింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో తక్కువ ధరకే టీకాను అందిస్తామని ఆక్స్ఫర్డ్ తెలిపింది.
కరోనాతో గాంధీజీ మునిమనుమడు మృతి
జొహెన్నెస్‌బర్గ్: మహాత్మాగాంధీ ముని మనుమడు, మనీలాల్గాంధీ కుమారుడు సతీశ్ ధూపేలియా కన్నుమూశారు. దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఆయనకు ఇటీవల కరోనా సోకింది. చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.
ప్రముఖ ఇండో-అమెరికన్ వైద్యుడు అజయ్ లోధా కన్నుమూత
న్యూయార్క్: ప్రముఖ ఇండో-అమెరికన్ వైద్యుడు అజయ్ లోధా (58) కన్నుమూశారు. కరోనా సోకడంతో తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఎనిమిది నెలలుగా పోరాడుతూ న్యూయార్క్‌లోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌లో శనివారం తుదిశ్వాస విడిచారు. అమెరికాలోని భారత సంతతి వైద్యుల సంఘం (ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడైన లోధా మరణంపై ఆ సంఘంతోపాటు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపాయి.