గురువారం 02 ఏప్రిల్ 2020
International - Feb 11, 2020 , 01:25:09

మోదీజీ.. రక్షించండి!

మోదీజీ.. రక్షించండి!
  • జపాన్‌ నౌకలో చిక్కుకున్న భారతీయుల ఆవేదన.. 168 మంది ఉన్నట్టు అంచనా
  • చైనాలో 908కి చేరిన కరోనా మృతులు.. 40 వేలు దాటిన నిర్ధారణ కేసులు

టోక్యో: భూ, వాయు మార్గాల ప్రయాణికులనే కాదు.. జలమార్గం గుండా ప్రయాణిస్తున్న వాళ్లను కూడా కరోనా మహమ్మారి వదలట్లేదు. కరోనా పరీక్షల కోసం గతవారం జపాన్‌ తీరనగరం యొకొహామాలో నిలిపివేసిన జపాన్‌ నౌక ‘డైమండ్‌ ప్రిన్సెస్‌'లో భారత్‌కు చెందిన ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని అక్కడి భారత రాయబార కార్యాలయం సోమవారం తెలిపింది. అయితే, ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తమను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం, ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితిని ఓడలో చిక్కుకుపోయిన భారతీయులు కోరుతున్నారు. గతనెల హాంకాంగ్‌లో దిగిన ప్రయాణికుడిలో కరోనా వైరస్‌ లక్షణాలు ఉండడంతో 3,711 మందితో ప్రయాణిస్తున్న డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకను యొకొహామాలో గతవారం నిలిపివేసి దిగ్భంధంలోకి తీసుకోవడం తెలిసిందే. నౌకలో ఉన్నవారికి పరీక్షలు నిర్వహించిన వైద్యుల బృందం సోమవారం మరో 65 మందికి కొత్తగా వైరస్‌ సోకినట్లు తేల్చింది. దీంతో నౌకలో ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 135కి చేరింది. జపాన్‌ తీరానికి చేరుకున్న నౌకలోని ప్రయాణికుల్లో ప్రాథమికంగా 300 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  

1.97 లక్షల మందికి స్క్రీనింగ్‌

కరోనా వైరస్‌బారినపడి మరణించిన వారి సంఖ్య 908కి చేరింది. ఆదివారం ఒక్కరోజే 97 మంది చనిపోయినట్టు చైనా అధికారులు వెల్లడించారు. వైరస్‌ నిర్ధారిత కేసుల సంఖ్య 40,171కి చేరింది. కరోనా విషయంలో వైద్యపరంగా సహాయ సహకారాలు అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ నిపుణుల బృందం సోమవారం రాత్రి చైనా చేరుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటివరకూ 1,818 విమానాల్లో భారత్‌కు వచ్చిన 1,97,192 మంది ప్రయాణికులకు కరోనా నేపథ్యంలో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. 
logo
>>>>>>