మంగళవారం 24 నవంబర్ 2020
International - Oct 20, 2020 , 00:58:56

కరోనా పోరులో మన అమ్మాయి

కరోనా పోరులో మన అమ్మాయి

  • అమెరికాలో అనికా చేబ్రోలు సంచలనం
  • ప్రతిష్ఠాత్మక యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డుకు ఎంపిక
  • కరోనా చికిత్సకు కొత్త ప్రక్రియను ఆవిష్కరణ

హ్యూస్టన్‌: అమెరికాలో మరో ఇండో-అమెరికన్‌ బాలిక మెరిసింది. టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో 8వ తరగతి చదువుతున్న 14 ఏండ్ల అనికా చేబ్రోలు ప్రతిష్ఠాత్మక ‘3ఎం యంగ్‌ సైంటిస్ట్‌' అవార్డు గెలుచుకుంది. అమెరికాలో పాఠశాల విద్యార్థులకు ఈ అవార్డు గెలుచుకోవటం అనేది ఒక కలలాంటిది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణకు లోతైన పరిశోధనతో వినూత్నమైన ఆవిష్కరణ చేసినందుకు ఆమెకు ఈ అవార్డు లభించింది. 3ఎం యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు విజేతలకు 25వేల డాలర్ల (రూ.18 లక్షలు) నగదు బహుమతి అందిస్తారు. అమెరికా నలుమూలల నుంచి ఈ అవార్డు పోటీ ఫైనల్స్‌కు పదిమంది విద్యార్థులు చేరుకోగా అనిక విజేతగా నిలిచింది. గతేడాది అనిక తీవ్రంగా జబ్బుపడింది. అప్పటి నుంచి ఆమె వైరస్‌ వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స విధానాలపై అధ్యయనం చేస్తున్నది. ఈ ఏడాది అమెరికాను చిన్నాభిన్నం చేసిన కరోనా నియంత్రణకు ఇన్‌-సిలికో విధానంలో ఔషధాన్ని రూపొందించటంపై ఓ పరిశోధన పత్రాన్ని రాసింది. శరీరంలో కొన్ని ప్రత్యేకమైన అణువులను ప్రేరేపించి కొవిడ్‌-19కు ఉండే స్పైక్‌ ప్రొటీన్లను బంధించవచ్చని, తద్వారా కరోనా వ్యాధిని నియంత్రించవచ్చని అనిక ప్రతిపాదించింది. ఆమె పరిశోధన పత్రం అద్భుతంగా, శాస్త్రీయంగా ఉండటంతో విజేతగా ప్రకటించారు. భవిష్యత్తులో తాను మెడిసిన్‌లో శాస్త్రవేత్త అవుతానని అనిక చేబ్రోలు తెలిపింది.

మనిషి జీవితంతోపాటు విశ్వం మొత్తానికి సైన్సే ఆధారం. కరోనా స్పైక్‌ ప్రొటీన్‌ను పనిచేయకుండా చేసేందుకు నేను రూపొందించిన విధానం కొవిడ్‌-19పై జరుగుతున్న పరిశోధనలతో పోల్చితే మహాసముద్రంలో నీటి బొట్టులాంటిదే. ఈ పరిశోధనను ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉన్నది.

- అనికా చేబ్రోలు