గురువారం 02 ఏప్రిల్ 2020
International - Feb 05, 2020 , 02:53:53

బుసకొడుతున్న క్యాన్సర్‌!

బుసకొడుతున్న క్యాన్సర్‌!
  • 2018లో కొత్తగా నమోదైన 11.6 లక్షల కేసులు
  • ప్రతి 10 మందిలో ఒకరు బాధితులు
  • పురుషుల్లో అత్యధికంగా నోటి క్యాన్సర్‌.. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌

ఐరాస, ఫిబ్రవరి 4: చాప కింద నీరులా వ్యాపిస్తూ.. శరీర కణజాలాన్ని క్రమంగా హరిస్తూ.. చివరికి ప్రాణాన్ని తీసే భయంకరమైన వ్యాధుల్లో క్యాన్సర్‌ ఒకటి. 2018లో దేశంలో 11.6 లక్షల క్యాన్సర్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. మంగళవారం ప్రపంచ క్యాన్సర్‌ దినం. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో, ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌(ఐఏఆర్సీ) సంస్థలు క్యాన్సర్‌ వ్యాధికి సంబంధించి సంయుక్తంగా రెండు నివేదికలను విడుదల చేశాయి. క్యాన్సర్‌పై గ్లోబల్‌ ఎజెండాను రూపొందించడమే లక్ష్యంగా ఒక నివేదికను రూపొందించగా.. మరో నివేదికలో క్యాన్సర్‌పై పరిశోధనలు, అరికట్టే మార్గాలపై చర్చించారు. 


49 శాతం వాటా ఆ ఆరు క్యాన్సర్‌లదే 

డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ క్యాన్సర్‌ నివేదిక ప్రకారం.. ప్రతి 10 మంది భారతీయుల్లో ఒకరు తన జీవితకాలంలో క్యాన్సర్‌ బారిన పడుతున్నారని, ప్రతి 15 మందిలో ఒకరు ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారని పేర్కొంది. 2018లో 11.6 లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదైనట్టు, ఆ ఏడాది ఈ వ్యాధితో 7,84,800 మంది చనిపోయినట్టు నివేదిక వెల్లడించింది. భారతీయుల్లో ఆరు రకాల క్యాన్సర్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయని, వాటిలో రొమ్ము క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఉదర క్యాన్సర్‌, పెద్దపేగు క్యాన్సర్‌ ఉన్నాయని నివేదిక వివరించింది. 2018లో నమోదైన కొత్త క్యాన్సర్‌ కేసుల్లో 49 శాతం వాటా వీటిదేనని పేర్కొంది. పురుషుల్లో నోటి క్యాన్సర్‌ కేసులు అత్యధికంగా (92 వేలు) నమోదవ్వగా, మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ కేసులు(1,62,500) ఎక్కువగా ఉన్నాయి. 


అల్పాదాయ దేశాల్లో 60 శాతం కేసులు 

పొగాకు సంబంధిత ఉత్పత్తులను తీసుకోవడం వల్ల నోరు, గొంతుకు సంబంధించిన క్యాన్సర్‌ వస్తున్నదని నివేదిక తేల్చింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వర్గాల్లోనే ఈ తరహా క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొంది. మరోవైపు, అధిక బరువు, ఊబకాయం, తగినంత వ్యాయామం లేకపోవడం, జీవనశైలిలో మార్పుల వల్ల్ల రొమ్ము, పెద్దపేగు సంబంధిత క్యాన్సర్‌ వస్తున్నదని, సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత వర్గాల్ల్లో ఈ తరహా క్యాన్సర్‌ కనిపిస్తున్నదని నివేదిక వెల్లడించింది. క్యాన్సర్‌ వ్యాప్తిని అరికట్టడంలో తగిన చర్యలు తీసుకోకపోతే  రానున్న 20 ఏండ్లలో అల్పాదాయ దేశాల్లో 60 శాతానికి పైగా క్యాన్సర్‌ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉన్నదని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. పొగాకును తీసుకునే 80 శాతం మంది ఈ దేశాల్లోనే నివసిస్తున్నారని, సిగరెట్‌, బీడీ వంటి వాటిని తాగే పురుషుల్లో 50 శాతం మంది చైనా, భారత్‌, ఇండోనేషియాలోనే నివసిస్తున్నారని నివేదిక పేర్కొంది. 


ముందుగా గుర్తించడం ముఖ్యం 

దేశంలో నోటి క్యాన్సర్‌ బారిన పడ్డ 90 శాతం మంది పేద, మధ్యతరగతి వర్గాలవారేనని నివేదిక వెల్లడించింది. క్యాన్సర్‌ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి, తగిన చికిత్స చేసుకోవడంతో 2000-2015 మధ్య అధిక ఆదాయ దేశాల్లో ఈ వ్యాధి వల్ల కలిగే మరణాలు 20శాతం తగ్గాయని, అయితే ఇది అల్ప ఆదాయ దేశాల్లో  కేవలం ఐదు శాతంగా ఉన్నదని ఐఏఆర్సీ డైరెక్టర్‌ ఎలీసబెటి వైడర్‌పాస్‌ తెలిపారు.


భారత్‌లో  క్యాన్సర్‌ కేసులు-2018

పురుషుల్లో

మహిళల్లో

నోటి క్యాన్సర్‌
92,000
రొమ్ము క్యాన్సర్‌
1,62,500
ఊపిరితిత్తుల క్యాన్సర్‌
49,000
గర్భాశయ క్యాన్సర్‌
97,000
ఉదర క్యాన్సర్‌
39,000
అండాశయ క్యాన్సర్‌
36,000
పెద్దపేగు క్యాన్సర్‌
37,000
నోటి క్యాన్సర్‌
28,000
అన్నవాహిక క్యాన్సర్‌
34,000
పెద్దపేగు క్యాన్సర్‌
20,000logo