మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Jan 12, 2020 ,

ఒమన్‌ సుల్తాన్‌ ఖబూస్‌ కన్నుమూత

ఒమన్‌ సుల్తాన్‌ ఖబూస్‌ కన్నుమూత

ఒమన్‌ దేశపు సుల్తాన్‌ ఖబూస్‌ బిన్‌(79) కన్నుమూశారు. ఆధునిక అరబ్‌ ప్రపంచంలో సుదీర్ఘకాలం పాలించిన ఖబూస్‌ తుదిశ్వాస విడిచారని రాజదర్బార్‌ శనివారం ప్రకటించింది. తీవ్ర విచారం, బాధను వ్యక్తపరుస్తూ.. గొప్ప సుల్తాన్‌ ఖబూస్‌ బిన్‌ శుక్రవారం కన్నుమూశారని తెలిపింది.

  • పెద్దపేగు క్యాన్సర్‌తో చికిత్సపొందుతూ మృతి
  • సంతాపం ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ
  • కొత్త సుల్తాన్‌గా హైతం బిన్‌ తారిఖ్‌

మస్కట్‌, జనవరి 11: ఒమన్‌ దేశపు సుల్తాన్‌ ఖబూస్‌ బిన్‌(79) కన్నుమూశారు. ఆధునిక అరబ్‌ ప్రపంచంలో సుదీర్ఘకాలం పాలించిన ఖబూస్‌ తుదిశ్వాస విడిచారని రాజదర్బార్‌ శనివారం ప్రకటించింది. తీవ్ర విచారం, బాధను వ్యక్తపరుస్తూ.. గొప్ప సుల్తాన్‌ ఖబూస్‌ బిన్‌ శుక్రవారం కన్నుమూశారని తెలిపింది. ఆయన కొంతకాలంగా పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఖబూస్‌కు పెండ్లి కాలేదు. ఆయనకు వారసులుగానీ, సోదరులుగానీ లేరు. ఒమన్‌ సుల్తాన్‌గా హైతం బిన్‌ తారిఖ్‌ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. 1970లో తండ్రి మరణించిన తర్వాత ఖబూస్‌ బిన్‌ పాలనపగ్గాలు చేపట్టారు. అరేబియా ద్వీపకల్పంలోని దేశాన్ని.. 50 ఏండ్ల తన పాలనలో ఆధునికతవైపు నడిపించారు. క్రియాశీల విదేశీ విధానాన్ని తీసుకొచ్చారు. గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌లో సభ్యత్వాన్ని కాపాడుకుంటూనే.. ప్రపంచదేశాలతో ఇరాన్‌ అణుఒప్పందం విషయంలో మధ్యవర్తిత్వాన్ని చేపట్టారు. ఖబూస్‌ మృతికి మూడ్రోజులు సంతాపదినాలుగా ప్రకటించారు.


ప్రధాని మోదీ సంతాపం

న్యూఢిల్లీ: ఒమన్‌ సుల్తాన్‌ ఖబూస్‌ బిన్‌ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. ఆ ప్రాంతానికి శాంతిమార్గం చూపిన గొప్పవ్యక్తిగా ఖబూస్‌ను అభివర్ణించారు. దూరదృష్టి కలిగిన నాయకుడిగా దేశాన్ని ఆధునికతవైపు నడిపారని ఆయన ట్విట్టర్‌లో కొనియాడారు. ఖబూస్‌ భారత్‌కు అసలైన స్నేహితుడని, ఒమన్‌- భారత్‌ మధ్య శక్తివంతమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధిపరిచిన బలమైన నేత అని మోదీ తెలిపారు.


కొత్త సుల్తాన్‌గా హైతం బిన్‌ తారిఖ్‌

ఒమన్‌లో సాంస్కృతికశాఖ మంత్రిగా ఉన్న హైతం బిన్‌ తారిఖ్‌ కొత్త సుల్తాన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఖబూస్‌ మార్గాన్నే అనుసరిస్తానని 65 ఏండ్ల తారిఖ్‌ తన తొలి ప్రసంగంలో చెప్పారు. దేశ ప్రజలు శాంతియుతంగా జీవించేలా విదేశీ విధానాలకు మద్దతు తెలుపుతామని ప్రకటించారు. ‘రాజ కుటుంబం సమావేశమై సుల్తాన్‌ సూచించిన వ్యక్తిని నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైతం బిన్‌ తారిఖ్‌ దేశ రాజుగా ప్రమాణస్వీకారం చేశారు’ అని ప్రభుత్వం వెల్లడించింది. ఉప ప్రధానిగా ఉన్న అసద్‌ బిన్‌ తారిఖ్‌.. సుల్తాన్‌గా ఎంపికవుతారని చాలామంది భావించారు.


logo