శనివారం 06 మార్చి 2021
International - Jan 19, 2021 , 03:25:01

నిఘా నీడలో అమెరికా!

నిఘా నీడలో అమెరికా!

  • బైడెన్‌ ప్రమాణానికి భారీ భద్రతా ఏర్పాట్లు 
  • వాషింగ్టన్‌లో అడుగడుగునా బలగాలు
  • భద్రతా సిబ్బందిలోనే కొందరు దాడులకు  దిగొచ్చు: ఎఫ్‌బీఐ

వాషింగ్టన్‌, జనవరి 18: అమెరికాలో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. అధ్యక్షుడిగా జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలాహ్యారిస్‌ ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ట్రంప్‌ మద్దతుదారులు హింసాత్మక దాడులకు పాల్పడవచ్చన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో భారీ స్థాయిలో బలగాలను మోహరిస్తున్నారు. రాజధాని వాషింగ్టన్‌ నగరం పూర్తిగా భద్రతా దళాలతో నిండిపోయింది. మరోవైపు, అంతర్గత దాడులు జరగొచ్చన్న నిఘా హెచ్చరికలతో రక్షణ వర్గాల్లో ఆందోళన నెలకొన్నది. భద్రతా సిబ్బందిలోనే కొందరు దాడులకు దిగే ప్రమాదమున్నదన్న భయాల నేపథ్యంలో నిఘాను పటిష్ఠం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భద్రత కల్పించేందుకు వాషింగ్టన్‌కు వస్తున్న 25వేల మంది నేషనల్‌ గార్డ్స్‌ను ‘ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌' (ఎఫ్‌బీఐ) క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. ఆదివారం పలు రాష్ర్టాల్లో నిరసనకారులు తుపాకులు చేతబట్టి క్యాపిటల్‌ (చట్టసభలుండే) భవనాల వద్ద ఆందోళన చేపట్టారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనం సమీపంలో సోమవారం అగ్నిప్రమాదం జరుగటంతో భవనాన్ని కాసేపు మూసేశారు. 

1.1 కోట్ల మంది  అక్రమ వలసదారులకు పౌరసత్వం

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే తొలిరోజే బైడెన్‌.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న 1.1 కోట్ల మంది వలసదారులకు చట్టబద్ధ నివాస హోదా కల్పించేలా చట్టం తేనున్నారు. తొలి రోజే దీనిని అమెరికా కాంగ్రెస్‌ ఆమోదానికి పంపనున్నారు. 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు ఇది మార్గం సుగమం చేయనుంది.

VIDEOS

logo