గురువారం 26 నవంబర్ 2020
International - Oct 19, 2020 , 17:34:05

కరోనాకుమారి.. కరోనాకుమార్‌..కొవిడ్‌ తెచ్చిన కొత్త పేర్లు!

కరోనాకుమారి.. కరోనాకుమార్‌..కొవిడ్‌ తెచ్చిన కొత్త పేర్లు!

హైదరాబాద్‌: కొవిడ్‌-19.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై బలమైన ప్రభావాన్ని చూపింది. తాము జీవితంలో చూడని,వినని ఎన్నో చేదు అనుభవాలను పంచింది. దీనివల్ల మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలైంది. ఈ సమయంలో చాలామంది ఆకలితో అలమటించారు. కొందరు ఉపాధి కోల్పోయారు. మరికొందరు ఈ సమయాన్ని తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగించుకున్నారు. మాస్కులు, శానిటైజర్ల వాడకం పెరిగింది. ఇదిలా ఉండగా, కొవిడ్‌-19 వల్ల పిల్లలకు కొత్త పేర్లు పుట్టుకొచ్చాయి. కొంతమంది కొవిడ్‌ సంబంధిత పేర్లు పెట్టి ఆశ్చర్యపరిచారు. అందులో కొన్ని పేర్లు,వాటి నేపథ్యాన్ని చూద్దాం..  

కరోనాకుమార్, కరోనాకుమారి..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఇద్దరు తల్లిదండ్రులు తమ పిల్లలకు వైరస్‌ పేరు పెట్టారు. శశికళ అనే మహిళకు ఆడపిల్ల జన్మించగా, ‘కరోనాకుమారి’గా నామకరణం చేశారు. రమాదేవిదంపతులకు కొడుకు పుట్టాడు. ఆ శిశువుకు ‘కరోనాకుమార్‌’ అని పేరు పెట్టారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగింది. వారికి ప్రసవం చేసిన డాక్టర్ల సూచనమేరకు వారు ఈ పేర్లు పెట్టారట. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లోని ఓ జంట తమకు పుట్టిన కవలలకు 'కరోనా', ‘కొవిడ్‌’ అని నామకరణం చేశారు.  

లాక్‌డౌన్‌, శానిటైజర్‌.. 

వైరస్‌ పేర్లే కాదు.. దీన్ని ఎదుర్కొనేందుకు మనం ఉపయోగించిన అస్త్రాలు కూడా పేర్లుగా కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో త్రిపురలో చిక్కుకున్న రాజస్థాన్‌కు చెందిన ఓ జంటకు అబ్బాయి పుట్టాడు. మార్చి 25న ప్రసవం జరిగింది. ఆ సమయంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో వారు తమ బిడ్డకు ‘లాక్‌డౌన్‌’ అని పేరు పెట్టేశారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ జంట తమ కొడుకుకు ‘శానిటైజర్‌’ అని పేరు పెట్టుకున్నారు. ప్రజలంతా చేతులు శుభ్రంచేసుకునేందుకు శానిటైజర్‌ వాడతారని, అలా తమ కొడుకు పేరు అందరికీ రిమైండర్‌గా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టుకున్నట్లు వారు వెల్లడించారు.   

కొవిడ్ మేరీ, కొవిడ్ బ్రయాంట్‌..

కొవిడ్‌ సంబంధిత పేర్లు కేవలం భారతీయులు మాత్రమే పెట్టుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో ఈ ఏడాదిలో పుట్టిన పిల్లలకు కరోనా రిలేటెడ్‌ పేర్లు పెట్టుకున్నారు. ఏప్రిల్‌లో తమకు పుట్టిన కూతురుకు ఓ ఫిలిప్పీన్‌ జంట ‘కొవిడ్‌ మేరీ’ అని పేరు పెట్టుకున్నారు. అలాగే, మరో జంట తమ కొడుకుకు ‘కొవిడ్‌ బ్రయాంట్‌’ అని నామకరణం చేశారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.