శనివారం 24 అక్టోబర్ 2020
International - Oct 13, 2020 , 01:50:51

అర్ధాంతరంగా మరణిస్తున్న అణు శాస్త్రవేత్తలు

అర్ధాంతరంగా మరణిస్తున్న అణు శాస్త్రవేత్తలు

15 ఏండ్లలో 1,540 మంది మృత్యువాత

సూసైడ్‌, అనారోగ్య సమస్యలేనని  చెబుతున్న పోలీసులు

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ ముఖ చిత్రమే మారిపోయింది. యుద్ధం అనంతర పరిస్థితులను బేరీజు వేసుకున్న పలు దేశాలు భవిష్యత్‌ రక్షణ అవసరాల దృష్ట్యా అణ్వాయుధాలను సిద్ధం చేసుకోవడానికి ఆసక్తి  కనబరిచాయి. ఈ క్రమంలో అణు శాస్త్రవేత్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. దేశ  రక్షణకు అవసరమైన అణ్వాయుధాలను తయారుచేసే అణు  శాస్త్రవేత్తలకు ఎంతటి గౌరవం దక్కుతున్నదో.. అంతే దయనీయ స్థితిలో వాళ్ల బతుకులు అర్ధాంతరంగా తెల్లారుతున్నాయి.  దేశ శ్రేయస్సు కోసం పాటుపడే  ఈ శాస్త్రవేత్తలు అనూహ్యంగా మరణిస్తున్నారు. వారి జీవితపు చివరిమజిలీలో ఏంజరిగిందో ఇప్పటికీ చిదంబర రహస్యమే!

దేశంలోని అణు శాస్త్రవేత్తలు అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు. గత 15 ఏండ్లలో అణ్వస్త్ర కేంద్రాలు, అంతరిక్ష పరిశోధన సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 1,540 మంది శాస్త్రవేత్తలు అనూహ్య పరిస్థితుల్లో మృతి చెందారు. అనారోగ్య సమస్యలు, ఒత్తిడితోకూడిన ఆత్మహత్యలు, ఇతరత్రా కారణాల వల్లే వాళ్లు మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నప్పటికీ, వారి మరణాలకు గల అసలు కారణం అంతుచిక్కడం లేదు. 

సందేహాలున్నాయి

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఉద్యమకారుడు చేతన్‌ కొఠారీ బాంబే హైకోర్టులో అణు శాస్త్రవేత్తల మరణాలకు సంబంధించి ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. గత 15 ఏండ్లలో 1,540 మంది అణు శాస్త్రవేత్తలు అనుమానాస్పద 

రీతిలో మరణించారని, అయితే ఈ మరణాలను ఆత్మహత్యలుగా, కారణం తెలియని మరణాలుగా ప్రభుత్వం రికార్డుల్లో చేర్చిందని పేర్కొన్నారు. ఈ మరణాలపై పలు సందేహాలు ఉన్నాయన్నారు. కాగా, అణు కేంద్రాల్లో పనిచేసే శాస్త్రవేత్తలపై రేడియేషన్‌ ప్రభావం ఉంటుందని, దీంతో క్యాన్సర్‌ వంటి దీర్ఘకాల అనారోగ్య సమస్యలకు లోనవ్వడంవల్లే వాళ్లు మరణిస్తున్నారని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) అధికారులు తెలిపారు.  ఒత్తిడి, కుటుంబ వ్యవ హారాలు తదితర కారణాలు కూడా శాస్త్ర వేత్తలు ఆత్మహత్యకు పాల్పడటానికి కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. 

అనుమానాలెన్నో?

అణు కార్యక్రమాల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు అనుమానాస్పదరీతిలో అకస్మాత్తుగా మరణిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులుగా అణు కార్యక్రమాలను పేర్కొంటారు. ఇందులో పనిచేసిన శాస్త్రవేత్తలు ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని శత్రు దేశాలకు చేరవేసే అవకాశం ఉన్నది. అందుకే, కీలకమైన ప్రాజెక్టు ముగిసిన వెంటనే, ఆ సమాచారం బయటకు పొక్కకుండా ప్రాజెక్టులో భాగ మైన శాస్త్రవేత్తలను కావాలనే అడ్డుతప్పిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఇది ఎంతవరకు వాస్తవమో ఇంకా తెలియదు.  

- నేషనల్‌ డెస్క్‌

బెజవాడలో కనిపించిన బార్క్‌ సైంటిస్ట్‌

గతవారం మైసూర్‌లో కనిపించకుండా పోయిన బార్క్‌ శాస్త్రవేత్త అభిషేక్‌ రెడ్డి గుల్లా (26) ఆచూకీ లభించింది. విజయవాడ శివారుల్లో సోమవారం ఆయన్ని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించారు. కాగా విధుల నిమిత్తం మైసూరులోని తన నివాసం నుంచి అదే నగరంలోని  బార్క్‌ కేంద్రానికి వెళ్తున్న అభిషేక్‌ గత మంగళవారం అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు.


logo