అమెరికాలో సంఘీభావ ర్యాలీలు

- భారీ ఎత్తున పాల్గొన్నసిక్కు అమెరికన్లు
వాషింగ్టన్: ఢిల్లీలో రైతుల ఉద్యమానికి సంఘీభావంగా అమెరికా వ్యాప్తంగా పలు నగరాల్లో వందలాది మంది సిక్కు అమెరికన్లు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేశారు. కాలిఫోర్నియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరసనకారులు శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్‌కు కార్ల ర్యాలీ నిర్వహించారు. వారి వాహన శ్రేణితో బే బ్రిడ్జిపై ట్రాఫిక్ స్తంభించింది. ఇండియానాపొలిస్‌లో సైతం వందలాది మంది ప్రదర్శన జరిపారు. న్యూయార్క్, హ్యూస్టన్ మిషిగాన్, షికాగో, వాషింగ్టన్ నగరాల్లో సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ‘రైతులు లేకపోతే ఆహారం లేదు. రైతులను కాపాడండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. భారత్‌లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాలు రైతులను పేదరికంలోకి నెట్టేస్తాయని, కార్పొరేట్ కంపెనీలకు గుత్తాధిపత్యం కట్టబెడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఏ దేశానికైనా రైతులే ఆత్మ. మనం ఆత్మను కాపాడుకోవాలి. భారత్‌లో కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని అమెరికా, కెనడా సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కోరుతున్నార’ని ఇండియానాకు చెందిన గురీందర్ సింగ్ ఖల్సా అన్నారు. భారత ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం ఇవ్వాలనే నిరసన చేపట్టామని అమన్‌దీప్ సింగ్ హుండల్ చెప్పారు.
ఎన్నారైల ఆర్థిక చేయూత
తీవ్రమైన చలిని సైతం లెక్కచేయక ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనోద్యమం చేస్తున్నారు. వారి పోరాటం ఆదివారం 11వ రోజుకు చేరింది. ఎన్ని రోజులైనా ఉద్యమం కొనసాగించడానికి సిద్ధమేనని, దానికి కావాల్సిన వనరులు, స్థోమత తమకు ఉన్నాయని కొందరు రైతులు చెబుతుంటే... విదేశాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్థికంగా చేయూతనందిస్తున్నారని మరికొందరు తెలిపారు. ‘కెనడాలో ఉంటున్న నా కుటుంబ సభ్యుడొకరు ఫోన్ చేసి మాకు అండగా ఉంటానని భరోసా ఇచ్చార’ని కిసాన్ సంఘర్ష్ కమిటీకి చెందిన నౌనిహాల్ సింగ్ తెలిపారు. కెనడా, బ్రిటన్, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో సిక్కులు గణనీయసంఖ్యలో ఉన్నారు. వారు నిధులు పంపిస్తామని ముందుకొస్తున్నారని రైతు నేతలు చెబుతున్నారు.
తాజావార్తలు
- కేసులతో విసిగి హిస్టరీ షీటర్ ఆత్మహత్య
- స్వచ్ఛ సిద్దిపేటే లక్ష్యం : మంత్రి హరీష్ రావు
- శాంసంగ్ కంపెనీ వైస్ చైర్మన్‌కు 2.5 ఏళ్ల జైలుశిక్ష
- వికారాబాద్‌లో రైలు ఢీకొని వ్యక్తి మృతి
- నా గురించే ఆలోచిస్తున్నావా చైతూ: సమంత
- అలెక్సీ నవాల్నీని అరెస్టు చేసిన రష్యా
- తెలంగాణలో శబరిమల...ఎక్కడో తెలుసా...?
- బేగంపేటలో రోడ్డుప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌జామ్
- సిరాజ్‌కు 5 వికెట్లు.. టీమిండియా టార్గెట్ 328
- మెట్రోరైల్ ప్రాజెక్టులకు ప్రధాని భూమిపూజ