శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 26, 2020 , 12:46:03

అమెరికా భారతీయుల కోసం కరోనా హెల్ప్‌లైన్లు

అమెరికా భారతీయుల కోసం కరోనా హెల్ప్‌లైన్లు

పెద్దన్న ట్రంప్‌ రాజ్యం అమెరికా కొవిడ్‌-19 వైరస్‌తో కొట్టుమిట్టాడుతోంది. కరోనా కాటుకు వందలమంది బలయ్యారు. దీన్ని నివారించడానికి పాఠశాలలు, హోటళ్లు తదితరాల మూసివేత వంటి చర్యలతోపాటు పర్యటనలపై ఆంక్షలు విధించింది. దీంతో 300కు పైగా యూనివర్సిటీలు, అనేక డార్మిటరీలు మూతపడ్డాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న భారతీయుల కోసం అమెరికాలోని ఇండియన్‌ అమెరికన్‌ గ్రూపులు హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశాయి. 

భారతీయ అమెరికన్‌ విద్యార్థులకు సహకరించేందుకు భారతీయ-అమెరికన్‌ సేవాసంస్థ ‘సేవా ఇంటర్నేషనల్‌' అనే ఓ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఇది 20 మంది డాక్టర్ల నేతృత్వంలో ఉచిత సహాయక కార్యక్రమాలను చేపడుతుంది. అమెరికాలో ఉన్న భారతీయుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను రిసీవ్‌ చేసుకుని వారికి అవసరమైన సలహాలను ఇస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు శ్రీశాంత్‌ వెల్లడించారు. ఉచిత ఆహార పంపిణీ, వృద్ధులకు సహాయం, కరోనా లక్షణాలను కలిగినవారు డాక్టర్లను సంప్రదించేందుకు సహకరిస్తారు. 

తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) భారతీయుల కోసం కొవిడ్‌-19 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఇది మూతపడిన యూనివర్సిటీల్లో ఇండియా స్టూడెంట్స్‌కు సహాయమందిస్తుంది. భారత రాయబార కార్యాలయ సమన్వయంతో పనిచేస్తున్న ఈ సంస్థలు ఎమర్జెన్సీ సమయంలో భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి వీసా పొందడం వంటి వ్యవహారాల్లో కూడా సహకరిస్తున్నాయి. 


logo