శనివారం 06 జూన్ 2020
International - May 02, 2020 , 12:51:02

అమెరికాలో డాక్టర్లకు 20 వేల భోజనాలు సరఫరా చేయనున్న ఎన్నారై సంస్థ

అమెరికాలో డాక్టర్లకు 20 వేల భోజనాలు సరఫరా చేయనున్న ఎన్నారై సంస్థ

హైదరాబాద్: అమెరికాలో అంతంత మాత్రం వనరులున్న ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లకు 20,000 భోజనాలు సమకూర్చేందుకు ప్రవాస భారతీయ స్వచ్ఛంద సంస్థ అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ (ఏఐఎఫ్) ముందుకు వచ్చింది. న్యూయార్క్, బే ఏరియా, బోస్టన్, షికాగో నగరాల్లోని వైద్యులకు భోజనం అందించనున్నట్టు ఫౌండేషన్ తెలిపింది. వరల్డ్ సెంట్రల్ కిచెన్ (డబ్ల్యూసీకే) సహకారంతో ఈ భోజనాల కార్యక్రమం నిర్వహించనున్నట్టు వివరించింది. అమెరికాలో అయినా, ఇండియాలో అయినా అగ్రగాములుగా నిలిచి ప్రాణాలను కాపాడుతున్న వైద్యులకు సహాయపడేందుకు ఇంతకన్నా మంచి సమయం ఉండదని ఏఐఎఫ్ సీఈవో నిశాంత్ పాండే అన్నారు. భారత్‌లో వలస కార్మికులతో సహా ఈసరికే లక్ష మందికి భోజనాలు సమకూరుస్తున్న ఈ సంస్థ తాజాగా అమెరికా ఆస్పత్రుల వైద్యులకు సాయం అందించేందుకు నడుం బిగించింది. డబ్ల్యూసీకేతో కలిసి వైద్యులకు ప్రతిరోజూ భోజనాలు సమకూర్చడం చాలా సంతోషం కలిగించే విషయమని, వైద్యులకు ఈవిధంగా సంస్థ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నదని పాండే వివరించారు. సంక్షోభ సమయంలో జన సమూహాలకు ఆహారం సరఫరా చేసేందుకు షెఫ్ జోస్ ఆంద్రెస్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్ సెంట్రల్ కిచెన్. వైద్యులకు సేవచేయడం గర్వించదగ్గ విషయమని డబ్ల్యూసీకే సీఈవో నేట్ మూక్ చెప్పారు.


logo