గురువారం 26 నవంబర్ 2020
International - Nov 09, 2020 , 01:32:12

కలల దారుల్లో కమల క్రాంతి

కలల దారుల్లో కమల క్రాంతి

  • ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దంలా కమల జీవితం
  • తల్లి, కుటుంబ సభ్యుల నుంచి జీవిత పాఠాలు
  • వాగ్ధాటి, ఉద్వేగపూరిత ప్రసంగాలకు చిరునామా
  • మహిళా సాధికారతకు నిరంతర కృషి..

శ్వేతవర్ణంతో తెల్లబోయిన రాజకీయాలకు కృష్టకాంతులు అద్దడానికి ఓ కమలం వికసించింది. అగ్రరాజ్యంలో మహిళలకు అగ్రతాంబూలం దక్కడం ‘కలే’నని  భావించిన మహిళామణులకు మార్గదర్శకురాలైంది. సుగుణం, లక్ష్య సాధన, ఆత్మవిశ్వాసం, మేధస్సు, తెగువకు నిలువుటద్ధంలా నిలిచి.. నల్లజాతీయుల గుండె చప్పుడుగా మారింది. ఆమే ‘లేడీ ఒబామా’గా పిలుస్తున్న కమలా హ్యారిస్‌. అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయిన తొలి మహిళ, తొలి నల్లజాతి అమెరికన్‌, తొలి ఇండో-అమెరికన్‌, తొలి ఆసియా-అమెరికన్‌, తొలి దక్షిణాసియా మహిళగా కమల రికార్డు సృష్టించారు.

విజేతల మోముపై విరిసే ధరహాసం వెనుక ఛీత్కారాలు కూడా ఉంటాయి, కమల జీవితం దీనికి అతీతమేమీ కాదు. 1964, అక్టోబర్‌ 20న కమల ఓక్లాండ్‌లో జన్మించారు. తల్లి శ్యామలా గోపాలన్‌ భారతీయురాలు. తండ్రి డొనాల్డ్‌ జేహ్యారిస్‌ జమైకాకు వ్యక్తి. వీరికి కమల, మాయ జన్మించారు. కమల ఏడో ఏటనే తల్లిదండ్రులు విడిపోయారు. వారాంతాల్లో తండ్రి హ్యారిస్‌ ఇంటికి కమల వెళ్లేవారు. ఒకరోజు ఆడుకోవడానికి పొరుగింటి పిల్లల దగ్గరకు కమల వెళ్లారు. అయితే నల్లజాతీయులన్న కారణంతో ఆ పిల్లలు కమలను దూరం పెట్టారు. జరిగిన సంగతిని తల్లికి చెప్పింది. నల్లజాతీయులపై కొనసాగుతున్న వివక్షను శ్యామల.. కమలకు వివరించారు. దీంతో వయసుతో పాటే మహిళా సాధికారత, జాతి వివక్షను రూపుమాపడం కోసం పాటుపడే లక్షణాలు కమల క్రమంగా అలవర్చుకున్నారు. 

మలుపుతిప్పిన రోజు..

హోవర్డ్‌ యూనివర్సిటీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, హెస్టింగ్స్‌ కాలేజీ ఆఫ్‌ లాలో కమల న్యాయవిద్యను అభ్యసించారు. 2002లో శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా ఎన్నికవడం కమల జీవితాన్ని మలుపుతిప్పింది. నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడటంలో, మాదక ద్రవ్యాలను మానుకోలేక జీవితాల్ని బలిపెట్టుకుంటున్న యువతకు కొత్త జీవితాన్ని చూపడంలో ఆమె ఎంతగానో కృషి చేశారు. దేశ ప్రగతి రథానికి విద్యార్థులే చోదకులుగా నమ్మే కమల.. పిల్లలు పాఠశాలలకు వెళ్లకపోతే తల్లిదండ్రులకు శిక్ష విధించాలని సూచించడమే గాకుండా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేశారు. తన ప్రసంగాలు, సామాజిక కార్యక్రమాలు అనతి కాలంలోనే ప్రజల అభిమానాల్ని చూరుగొన్నాయి. ఈ క్రమంలో ఆమె  వాగ్ధాటి, ఉద్వేగపూరిత ప్రసంగాన్ని చూసిన అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఎంతో ముగ్ధులయ్యారు. అలా క్రమంగా డెమోక్రటిక్‌ పార్టీలో చేరిన ఆమె.. ‘లేడీ ఒబామా’గా కీర్తించబడ్డారు. 2016లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున సెనేట్‌కు ఎన్నియ్యారు.

నిధులు సేకరించలేకపోతున్నా..

అమెరికన్‌ సమాజంలో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న రుగ్మతలను పెకిలించాలనుకున్న కమల తొలుత అధ్యక్ష పదవిపైనే దృష్టిపెట్టారు. డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ గతేడాది ప్రకటించారు. నిధుల సేకరణలో వెనుకబడటంతో రే సు నుంచి తప్పుకున్నారు.

ఇసుక తిన్నెల్లో.. 

తాతయ్యతో సెలవుల్లో అప్పుడప్పుడు తమిళనాడుకు వెళ్లే కమల తన తాతయ్య గోపాలన్‌తో కలిసి చెన్నై బీచ్‌లలో నడిచేవారు.ఆయన చెప్పే భారతీ య సంప్రదాయాలు, కథ లను శ్రద్ధగా వినేవారు.  

‘మోమల’గా మారిన కమల

కమలా హ్యారిస్‌ భర్త పేరు డగ్లస్‌ ఎవ్‌ుహోఫ్‌. వీరు 2014లో వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. డగ్లస్‌కు 2014కు ముందే కుమారుడు, కుమార్తె ఉన్నారు. సవతి పిల్లలన్న పేరేగానీ, తన కన్న బిడ్డలుగానే  కమల ఆ చిన్నారులను కూడా అక్కున చేర్చుకున్నారు. కమలను ఆ పిల్లలు ‘మోమల’ అని ఆప్యాయంగా పిలుస్తారు.

ఇది మహిళల విజయం: కమలా హ్యారిస్‌

వాషింగ్టన్‌: ఎన్నికల్లో తాను సాధించిన విజయం మహిళా లోకం సాధించిన గెలుపుగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్‌ అభివర్ణించారు. తాను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం తన తల్లి శ్యామలా గోపాలన్‌ ఇచ్చిన స్పూర్తేనని ఆమె గుర్తు చేసుకున్నారు. విల్మింగ్టన్‌లో శనివారం రాత్రి నిర్వహించిన విజయోత్సవ సభలో కమల ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. అమెరికాకు కొత్త రోజులు రాబోతున్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం, జాతి వివక్షను రూపుమాపడం వంటి విషయాల్లో అసలైన పని ఇప్పుడే మొదలుకాబోతున్నదని తెలిపారు. ముందున్న మార్గం అంత సులువైందేమీకాదని, అయితే, దేనికైనా అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి తొలి మహిళనైనా.. చివరి మహిళను మాత్రం కాబోనని అన్నారు.