బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 27, 2020 , 19:06:58

లక్షణాలు లేనివారికి కొవిడ్‌ టెస్ట్‌ అవసరం లేదు: యూఎస్‌ తాజా నిర్ణయం

లక్షణాలు లేనివారికి కొవిడ్‌ టెస్ట్‌ అవసరం లేదు: యూఎస్‌ తాజా నిర్ణయం

వాషింగ్టన్‌: కొవిడ్‌ ఉన్నవారితో సన్నిహితంగా మెదిలినవారికి లక్షణాలు లేకుంటే కరోనా టెస్ట్‌లు అవసరంలేదని అమెరికా సర్కారు తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెబ్‌సైట్‌లో మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే, కొవిడ్ -19 లక్షణాలున్నవారితో కలిసి ఉన్నవారు లక్షణాలు లేకున్నా టెస్ట్‌ చేయించుకోవాల్సిందేనని గతంలో సీడీసీ పేర్కొంది. అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వకుండా కొత్త మార్గదర్శకాలు ఇవ్వడం గమనార్హం. 

కరోనా సోకిన వ్యక్తికి ఆరడుగులలోపు పదిహేను నిమిషాలుంటేనే కొవిడ్‌ టెస్టులు చేయించుకోవాలని సీడీసీ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే, టెస్టుల్లో నెగెటివ్‌ రాగానే, కరోనా రాలేదని అనుకోవద్దని.. భవిష్యత్తులో వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. లక్షణాలు కనిపించిన ప్రతిఒక్కరూ విధిగా టెస్టులకు వెళ్లాలని సీడీసీ సూచించింది. ఒకవేళ టెస్టులు చేయించుకోనట్లయితే కచ్చితంగా పదిరోజులు ఐసోలేషన్‌లో ఉండాలని సూచించింది. 

మార్గదర్శకాల సవరణపై చర్చ..

కొవిడ్‌ టెస్ట్‌లపై సీడీసీ తాజా మార్గదర్శకాలపై అమెరికాలో చర్చ నడుస్తోంది. కరోనా కట్టడిలో విఫలమైన ట్రంప్‌ సర్కారు కావాలనే మార్గదర్శకాలను సవరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై వైట్‌హౌస్‌ కరోనా టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు ఆంథోనీ ఫౌచీ కూడా ఆందోళన వ్యక్తంచేశాడు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇస్తుందన్నాడు. ఈ మార్గదర్శకాలు కొవిడ్‌ లక్షణాలు లేనివారినుంచి కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఇస్తున్నట్లుగా తనకు అనిపిస్తోందన్నారు. ఈ సవరణ గురించి తనకు తెలియదని స్పష్టంచేశాడు.  ఈ మార్గదర్శకాలు తనకు అర్థం కావడంలేదని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, మరియు బాల్టిమోర్ మాజీ ఆరోగ్య కమిషనర్ లీనా వెన్ పేర్కొన్నారు. ట్రంప్‌ ఆదేశాలతోనే మార్గదర్శకాలను మార్చారని పలువురు మండిపడ్డారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo