శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Feb 11, 2020 , 09:56:00

క‌రోనా వ్యాక్సిన్‌.. ఎలుక‌ల‌పై ప‌రీక్ష‌లు

క‌రోనా వ్యాక్సిన్‌.. ఎలుక‌ల‌పై ప‌రీక్ష‌లు

హైద‌రాబాద్‌:  చైనాలో క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ ప్రాణాంత‌క వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు చైనా తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ది.  విష‌పూరిత‌మైన వైర‌స్‌ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ త‌యారీ కోసం ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ది.  నావెల్ క‌రోనా వైర‌స్‌ను అదుపులోకి తెచ్చేందుకు చైనాలోని వైద్య‌ నిపుణులు వ్యాక్సిన్ వేట‌లో ప‌డ్డారు.  సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ (సీడీసీ) శాఖ వ్యాక్సిన్ త‌యారీ కోసం జంతువుల‌పై ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు వార్త‌లు వెలుబ‌డ్డాయి.  ఎంఆర్ఎన్ఏ(mRNA) వ్యాక్సిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు.  సీడీసీతో పాటు షాంఘైలో ఉన్న తోంగ్జీ వైద్య విశ్వ‌విద్యాల‌యం, స్టెర్మిర్‌నా థెర‌పాటిక్స్ కంపెనీలు.. సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను జంతువుల‌పై ప‌రీక్షిస్తున్నాయి. 

గ‌త ఆదివారం రోజున సుమారు వంద ఎలుక పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ శ్యాంపిళ్ల‌ను ఇచ్చిన‌ట్లు చైనాకు చెందిన ప్ర‌ఖ్యాత వార్తా వెబ్‌సైట్ పేర్కొన్న‌ది. క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డిన రెండు వారాల్లోనే ఈ వ్యాక్సిన్‌కు చైనా రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే జంతువుల‌పై జ‌రుగుతున్న వ్యాక్సిన్ ప‌రీక్ష తొలి ద‌శ‌లోనే ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.  ఆ వ్యాక్సిన్‌ను మ‌నుషుల‌పై వాడడానికి ముందు ఇంకా అనేక ప‌రీక్ష‌లు చేప‌ట్టాల్సి ఉందంటున్నారు.  ఎలుక‌ల‌పై జ‌రుగుతున్న ప‌రీక్ష తొలి ద‌శ మాత్ర‌మే అని, ఆ త‌ర్వాత ఆ వ్యాక్సిన్‌కు ఉన్న ప్రాణాంత‌క ప‌రీక్ష‌ల‌ను మ‌రింత పెద్ద జంతువుల‌పైన‌ కూడా చేప‌ట్టాల్సి ఉంద‌ని అధికారులు తెలిపారు.

ఎలుక‌ల‌పై ప‌రీక్ష‌లు ముగిసిన త‌ర్వాత‌.. కోతుల‌పై వ్యాక్సిన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.  ఆ త‌ర్వాత ఆ వ్యాక్సిన్ సుర‌క్షిత‌మైన‌ద‌ని తేలితేనే దాన్ని మ‌నుషుల‌పై ప్ర‌యోగిస్తార‌ని తోంగ్జీ వ‌ర్సిటీ పేర్కొన్న‌ది. సాంప్ర‌దాయ వ్యాక్సిన్ల‌ను త‌యారీ చేసే ప‌ద్ధ‌తి క‌న్నా త్వ‌ర‌గానే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయ‌వ‌చ్చు అన్నారు. చైనాతో పాటు ప్ర‌పంచ‌దేశాల్లోని అనేక ప‌రిశోధ‌నా సంస్థ‌లు క‌రోనా నియంత్ర‌ణ‌కు వ్యాక్సిన్ త‌యారీలో ఉన్నాయి.  ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల చైనాలో మృతిచెందిన వారి సంఖ్య వెయ్యి దాటింది.


logo