శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 26, 2020 , 12:31:05

ఆశ్చర్యం.. ఉత్తర కొరియాలో ఒక కరోనా కేసు లేదు

ఆశ్చర్యం.. ఉత్తర కొరియాలో ఒక కరోనా కేసు లేదు

  • - కరోనా వస్తే ఖతమే ఇక
  • - ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్  జాంగ్ ఉన్

దాదాపు 160 దేశాలు కరోనా వల్ల తల్లడిల్లితున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒక్క వేలకు పైగా ప్రజలు దీని బారిన పడి దుర్మరణం చెందారు. ప్రజల జీవితాలను చిద్రం చేస్తూ.. ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తూ.. అల్లకల్లోలం చేస్తున్న కరోనాను కట్టడి చేయడానికి ప్రతి దేశం తీవ్రంగా శ్రమిస్తున్నది. ప్రపంచం నలుమూలలా కరోనా వల్ల ఇంత కల్లోలం చెలరేగుతున్నా.. ఉత్తర కొరియాలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విస్తుగొలిపే విషయం.  కరోనా తమ దేశంలోకి అడుగుపెడితే.. తీవ్ర పరిణామాలుంటాయ్ అని ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరించారు. ఇంతకి ఏమిటీ హెచ్చరిక కథ అని అంటారా? 

కరోనా గురించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం లాక్ డౌన్ ప్రకటించారు. 21 రోజుల పాటు లక్ష్మణ్ రేఖను గీశాడు. ఆ గీత దాటకపోవడమే మనకు శ్రీరామరక్ష అన్నారు. కానీ, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వాలకం చూస్తే అందరూ ఏదో అనుకుంటారు కానీ.. ఫిబ్రవరి 29న ఈ గట్టి సార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికో తెలుసా? తమ పార్టీలోని ప్రధాన అధికారులకి. కరోనా తమ దేశంలోకి ప్రవేశిస్తే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. పొరుగున ఉన్న దక్షిణ కొరియాలో కరోనా వైరస్ వల్ల అనేక మంది ప్రజలు మరణిస్తున్నారని తెలియడంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.

అసలే పేద దేశం, అత్యాధునిక రీతిలో ఆరోగ్య వ్యవస్థ డెవలప్ కాలేదు అందుకే ఏమాత్రం ఆలోచించకుండా పక్క దేశాలతో ఉన్న సరిహద్దుల్ని పూర్తిగా మూసేసింది. పర్యాటకుల్ని రానీయకుండా అడ్డుకట్ట వేసింది. రైళ్లు, అంతర్జాతీయ విమానాల్ని రద్దు చేసింది. క్వారంటైన్ చర్యల్లో భాగంగా విదేశీయులను దేశంలో నుంచి బయటికి పంపించేసింది. కొత్త స్కూలు విద్యా సంవత్సరాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. అందుకే, ఆ దేశంలోకి కరోనా అడుగుపెట్టలేదని సమాచారం.  అయితే, ఇందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అక్కడి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన ఇంతవరకూ చేయలేదు.


logo