సోమవారం 26 అక్టోబర్ 2020
International - Oct 11, 2020 , 02:42:05

బిగ్‌బ్యాంగ్‌కి ముందే..మరో విశ్వం

బిగ్‌బ్యాంగ్‌కి ముందే..మరో విశ్వం

  • భవిష్యత్తులోనూ బిగ్‌బ్యాంగ్‌లు ఉంటాయి 
  • ఈ విశ్వమే మొదటిదీ కాదు.. చివరిదీ కాదు
  • ఇదంతా ఆదిఅంతాల్లేని అనంత ప్రక్రియ 
  • ఫిజిక్స్‌ నోబెల్‌ విజేత రోజర్‌ పెన్‌రోస్‌ కొత్త ప్రతిపాదన 

బిగ్‌బ్యాంగ్‌ (మహా విస్ఫోటం).. అనంత విశ్వం పుట్టుకకు కారణమైన ఘటన. విశ్వంలో ఇప్పుడున్న పదార్థమంతా ఒకచోట కేంద్రీకృతమై ఒక ముద్దగా ఉన్న సమయంలో దానిలో ఏర్పడిన అసాధారణ ఒత్తిడితో ఒక్కసారిగా అది బద్ధలై కోటానుకోట్ల నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని వివరించేదే ఈ బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతం. కానీ ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్‌ బహుమతి విజేత రోజర్‌ పెన్‌రోస్‌ మాత్రం ఈ సిద్ధాంతానికి విరుద్ధమైన ప్రతిపాదన చేసి సంచలనం సృష్టించారు. మహావిస్ఫోటాకి ముందే మరో విశ్వం ఉండేదని, ఇప్పుడున్న విశ్వం కూడా భవిష్యత్తులో అంతరించి మరో మహా విస్ఫోటం సంభవిస్తుందని చెప్తున్నారు. అంటే బిగ్‌బ్యాంగ్‌ అనేది ఒక్కసారి మాత్రమే జరిగే దృగ్విషయం కాదు.. అది అనంతకాలంలో పలుమార్లు సంభవించే మహా ఖగోళ ప్రక్రియ అని ఆయన చెబుతున్నారు. తద్వారా ఇప్పుడున్న ఈ విశ్వమే మొదటిదీ కాదు.. చివరిదీ కాదని.. ఇది ఆదిఅంతాలు లేని అనంత ప్రక్రియ అని పెన్‌రోస్‌ సూత్రీకరిస్తున్నారు.

పెరిగి పెరిగి కుంచిస్తుంది 

ఇప్పుడున్న విశ్వం ఏర్పడటానికి కారణమైన మహావిస్ఫోటనం 1380 కోట్ల సంవత్సరాల క్రితం సంభవించింది అనేది ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ భౌతికశాస్త్రవేత్తల అభిప్రాయం. అప్పటినుంచి ఈ విశ్వం ఇంకా ఇంకా విస్తరిస్తూనే ఉన్నదని వాళ్లు భావిస్తున్నారు. ఇలా పెరిగీ పెరిగీ చివరకు మళ్లీ ఒక ముద్దలా కుంచించుకుపోతుందని, ఆ తర్వాత వందలకోట్ల ఏండ్ల తర్వాత మళ్లీ బిగ్‌బ్యాంగ్‌ సంభవిస్తుందని పెన్‌రోస్‌ తాజాగా చెబుతున్నారు. ఇందుకు ఆయన ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ ప్రతిపాదించిన ‘హాకింగ్‌ ఎవాపరేషన్‌' సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకున్నారు. పెన్‌రోస్‌ సుదీర్ఘకాలం హాకింగ్‌తో కలిసి పనిచేశారు.

స్టీఫెన్‌ హాకింగ్‌ సిద్ధాంతం విస్తరణ.. 

హాకింగ్‌ ఎవాపరేషన్‌ ప్రకారం విశ్వంలోని కృష్ణబిలాల్లోని శక్తి మొత్తం ఏదో ఒకరోజు హరించుకుపోయి అవి ఆవిరి అయిపోతాయి. అందుకు విశ్వంలోని రుణ, ధనాత్మకశక్తుల మధ్య సంయోగమే కారణం. కృష్ణబిలాల నుంచి శక్తి మొత్తం రేడియేషన్‌ రూపంలో వెదజల్లబడుతుంది. ఈ సిద్ధాంతాన్ని పెన్‌రోస్‌ విస్తరించారు. కృష్ణబిలాల్లో ఎలాగైతే శక్తి హరించుకుపోతుందో.. అలాగే విశ్వంలోని శక్తి మొత్తం హరించుకుపోయి అత్యంత తీవ్రమైన గురుత్వాకర్షణ జనిస్తుంది. అది విశ్వపదార్థాన్నంతా దగ్గరికి లాగేసుకుంటుంది. అలా ఒక్క ముద్దగా మారిన పదార్థంలో తీవ్రమైన ఒత్తిడి పుట్టి మళ్లీ మహా విస్ఫోటం సంభవిస్తుంది. దాన్నుంచి వచ్చే వందలకోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతతో మళ్లీ శక్తి జనించి నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడుతాయని పెన్‌రోస్‌ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. logo