గురువారం 28 మే 2020
International - Apr 09, 2020 , 12:15:44

రాజకీయాలు కాదు.. ఐక్యత నేటి అవసరం

రాజకీయాలు కాదు.. ఐక్యత నేటి అవసరం

- అమెరికా, చైనాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హితవు

హైదరాబాద్: అమెరికా, చైనాల మధ్య కరోనా విషయమై తగాదాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చైనా వైపు మొగ్గుతున్నదని ఆరోపించారు. అంతేకాకుండా ఆ సంస్థకు అమెరికా ఇవ్వాల్సిన నిధులు ఆపేస్తానని బెదిరించారు. దీనిపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం గెబ్రేసస్ తీవ్రంగా స్పందించారు. కరోనా ముప్పు భూగోళాన్ని చుట్టుముట్టిన ప్రస్తుత తరుణంలో రాజకీయాలకు తావులేదని అన్నారు. అమెరికా, చైనా.. రెండూ కూడా నిజాయితీతో కూడిన నాయకత్వాన్ని అందించాల్సి ఉన్నదని గెబ్రేసస్ పేర్కొన్నారు. విశ్వమహమ్మారిని ఎదుర్కోవడంలో డబ్ల్యూహెచ్‌వో పనితీరును సమర్థించుకున్నారు. ఇప్పుడు కావాల్సింది ఐక్యత అని, రాజకీయాలు ససేమిరా వద్దని అన్నారు. అమెరికా తనవంతు నిధులు సమకూరుస్తుందని గెబ్రేసస్ ఆశాభావం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌వో చైనా వైపు మొగ్గుతు చూపుతుందని ట్రంప్ చేసిన విమర్శను ఆయన తిప్పికొట్టారు. తమ సంస్థకు రంగుభేదాలు తెలియవని గతంలో ఇథియోపియా విదేశాంగమంత్రిగా పనిచేసిన గెబ్రేసస్ అన్నారు. అన్నిదేశాలకూ తాము సన్నిహితమేనని నొక్కిచెప్పారు.


logo