బుధవారం 03 జూన్ 2020
International - May 21, 2020 , 15:05:16

లాక్‌డౌన్ లేని దేశంలో మరణఘోష

లాక్‌డౌన్ లేని దేశంలో మరణఘోష

స్టాక్‌హోం: కరోనా కల్లోల ప్రపంచంలో లాక్‌డౌన్ ఏమాత్రం అమలు చేయని దేశం స్వీడన్‌. ప్రజలు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేలా జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. లాక్‌డౌన్ అమలు చేయాల్సిన అవసరం లేదు అని స్వీడన్ ఒంటెత్తు పోకడలో పోయింది. మొన్నటిదాకా పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు కనిపించింది. కానీ మే 13 నుంచి 20వ తేదీ మధ్యన గల వారంరోజుల్లో తలసరి మరణాల రేటు బ్రిటన్, ఇటలీ, బెల్జియంను మించిపోయింది. పదిలక్షల జనాబాకు ఏడురోజుల సగటు మరణాల రేటు 6.08గా నమోదైంది. కాగా యూకే, బెల్జియం, యూఎస్ మరణాల రేట్లు 5.57, 4.28, 4.11గా నమోదయ్యాయి. దీంతో లాక్‌డౌన్ నివారించే విషయంలో స్వీడన్ నిర్ణయంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ అంటువ్యాధుల సలహాదారు ఆండర్స్ టెగ్‌నెల్ ఈ నిర్ణయానికి మూలకారకుడు. లాక్‌డౌన్ లేకుండానే కరోనాను కట్టడి చేద్దామని వాదించింది ఆయనే. దాంతో స్వీడన్‌లో రెస్టారెంట్లు, బార్లు మామూలుగా తెరచిుంచారు. పాఠశాలలకు కూడా సెలవులు ఇవ్వలేదు. వ్యాపార కేంద్రాలు, పరిశ్రమలు మామూలుగా పనిచేశాయి. ప్రజాజీవనం యథాతథంగా కొనసాగింది. ఇది చాలాదేశాలను నివ్వెరపర్చింది. కొందరు దీన్ని పరిణతి కలిగిన ప్రతిస్పందనగా అభివర్ణించారు. అయితే వారం రోజుల మరణాల రేటు గురించి మాట్లాడడం అర్థరహితమని టెగ్‌నెల్ కొట్టిపారేశారు. స్వీడన్ తో పోల్చి చూపుతున్న దేశాల మొత్తం మరణాలు చాలాచాలా ఎక్కువగా ఉన్న సంగతి గుర్తించాలని ఆయన అంటున్నారు.


logo