గురువారం 04 జూన్ 2020
International - Apr 20, 2020 , 17:02:37

కరోనా: నో లాక్‌డౌన్.. స్వీడన్ విధానం ఇదే

కరోనా: నో లాక్‌డౌన్.. స్వీడన్ విధానం ఇదే

హైదరాబాద్: ఊరందరిది ఒకదారి అయితే ఉలిపికట్టెది ఒకదారి అన్నట్టుంది స్వీడన్ విధానం. ప్రపంచవ్యాప్తంగా కరోనా నివారణకు లాక్‌డౌన్ ఒక్కటే శరణ్యం అని అందరూ భావిస్తుంటే ఈ ఉత్తర యూరప్ దేశం మాత్రం ఎలాంటి కట్టుబాట్లు అమలు చేయడం లేదు. స్కూళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. హోటళ్లు తెరిచే ఉన్నాయి. పార్కులకు సకుటుంబంగా వెళ్తూనే ఉన్నారు. అయితే బహిరంగ స్థలాల్లో కొన్ని చేయదగినవి, చేయగూడనివి అంటూ ఆరోగ్య విభాగం వారు ప్రకటించారు. ప్రజలు వాటిని పాటిస్తున్నారు. ఈ ధోరణి సహజంగానే ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నది. అలాగని స్వీడన్‌లో అసలు కరోనా లేదని కాదు. 14,385 కేసులు నమోదు కాగా 1540 మరణాలు సంభవించాయి. కొందరు ఈ ధోరణిపై విసుక్కుంటున్నారు. మరికొందరు భలే స్వీడన్లు అని మెచ్చుకుంటున్నారు. ఎలా ప్రవర్తించాలో ప్రజలకే వదిలేయడం స్వీడన్ ప్రత్యేకత అని చెప్పాలి. జ్వరం, జలుబు వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే దవాఖానకు ఫోన్ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఇలా కొన్ని స్వీయ నిబంధనలతో కరోనా కల్లోలాన్ని స్వీడన్ ఎదుర్కొంటున్నది. ఏమాత్రం కంగారు లేకుండా నింపాదిగా వ్యవహరిస్తున్నది. అన్నీ తెరిచే ఉన్నాయి. దీనిని అమాయకత్వం అని కొందరు విమర్శించినా స్వీడన్ పరిశీలకులు మాత్రం ఇది పరిణతి అని సర్టిఫికెట్ ఇస్తున్నారు. చిన్నపిల్లల్లా తత్తరపడకుండా ఎదిగిన మనుషుల్లా గంభీరంగా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు. మరి అన్నిదేశాల్లో ఈ ధోరణి పనికివస్తుందా? అంటే చెప్పలేం.


logo