శనివారం 28 నవంబర్ 2020
International - Nov 06, 2020 , 07:30:12

నిస్సందేహంగా విజ‌యం మాదే!: బైడెన్‌

నిస్సందేహంగా విజ‌యం మాదే!: బైడెన్‌

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌నే వ‌రిస్తుంద‌ని డెమొక్రాట్ అభ్య‌ర్థి జో బైడెన్ విశ్వాసం వ్య‌క్తంచేశారు. ఓట్ల లెక్కింపు పూర్త‌యితే నిస్సందేహంగా త‌మ‌నే విజేత‌లుగా ప్ర‌క‌టిస్తార‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం వెలువ‌డిన ఫ‌లితాల‌ను బ‌ట్టి ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థి క‌మ‌లా హారీస్‌, తాను సంతృప్తిగా ఉన్నామ‌ని వెల్ల‌డించారు. ఓట్ల లెక్కింపు పూర్త‌యిన త‌ర్వాత త‌మ‌నే విజ‌యం వ‌రిస్తుంద‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేద‌న్నారు. అందువ‌ల్ల త‌మ మ‌ద్ద‌తుదారులు ప్ర‌శాంతంగా ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 

ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ద‌ని, త్వ‌ర‌లోనే ముగుస్తుంద‌ని వెల్ల‌డించారు. వీలైనంత తొంద‌ర‌గా ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతాయ‌ని చెప్పారు. ఫ‌లితాలకోసం ఓపిక‌గా ఎదురుచూస్తున్న‌వారంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. కాబోయే అధ్య‌క్షుణ్ని తేల్చాలంటే ప్ర‌తి ఒక్క ఓటును త‌ప్ప‌నిస‌రిగా లెక్కించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతుం‌డ‌టంపై ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ మ‌హ‌మ్మారివ‌ల్ల ఇప్ప‌టికే 2 ల‌క్ష‌ల 40 వేల మంది చ‌నిపోయార‌ని వెల్ల‌డించారు. ప్ర‌తిఒక్క‌రు త‌మ‌ స‌న్నిహితుల‌ను కోల్పోతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు.