మంగళవారం 24 నవంబర్ 2020
International - Oct 29, 2020 , 17:02:01

200 రోజులుగా అక్కడ ఒక్క కరోనా కేసు లేదు..!

200 రోజులుగా అక్కడ ఒక్క కరోనా కేసు లేదు..!

తైపీ : కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు కోట్ల సంఖ్యలో దవాఖానల్లో చేరి చికిత్స పొందారు. ఇప్పటివరకు 11 లక్షలకుపైగా చనిపోయారు. చైనాలోని వుహాన్‌ నుంచి వచ్చి అన్ని దేశాలను వణికించిన కరోనా వైరస్‌.. ఒక్క దేశంలో మాత్రం దాని పాచికలు పారడంలేదు. గత 200 రోజులుగా ఈ దేశంలో ఒక్క కరోనా వైరస్‌ ప్రభావిత కేసు నమోదు కాలేదంటే నమ్మశక్యంగా లేదు కదూ! ఇది నిజంగా నిజం. ఆ దేశమే తైవాన్‌.

తైవాన్ ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యుత్తమ వైరస్ రికార్డును కలిగి ఉంది. గురువారం మరో కొత్త మైలురాయికి చేరుకుంది. తైవాన్‌ దేశంలో చివరి కేసు ఏప్రిల్ 12 న నమోదవగా.. సెకండ్‌ వేవ్‌ కనిపించలేదు. తైవాన్‌ జనాభా 23 మిలియన్లకు పైగా ఉండగా.. వైరస్‌ వ్యాప్తి జరుగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు? అనేది ఆశ్చర్యకరంగా మారింది. తైవాన్‌లో ఇప్పటివరకు 553 కేసులు ధ్రువీకరించబడగా.. ఏడుగురు మాత్రమే చనిపోయారు. 513 మంది చికిత్స పొంది దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ సంక్రమణ ప్రారంభంలో దేశ సరిహద్దులను మూసివేయడం, ప్రజల ప్రయాణాలపై కఠిన నియంత్రణ కారణంగా వైరస్‌పై పోరాడటానికి అవకాశం దొరికిందని నిపుణులు చెప్తున్నారు. కఠినమైన కాంటాక్ట్ ట్రేసింగ్, టెక్నాలజీ-ఎన్‌ఫోర్స్‌డ్ దిగ్బంధం, విస్తృతంగా మాస్కులు ధరించేలా చూడటం వంటి అంశాలు వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా దోహదపడ్డాయని వారు అంటున్నారు. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. గతంలో తైవాన్ దేశ ప్రజలు సార్స్‌ కారణంగా పెద్ద అనుభవాన్ని గడించారు. ఈ అనుభవమే వారిని కరోనా సోకకుండా చేసిందని చెప్పవచ్చు. ప్రజలను నిర్బంధంలో ఉంచడం అంత సులభమైన పనికాదని నమ్మిన తైవాన్ ప్రభుత్వం.. కరోనా వైరస్‌ బారిన పడినవారికి భోజనం, నిత్యావసరాలు అందించడానికి చర్యలు తీసుకున్నది. రోబోల సాయంతో చికిత్స అందించింది. అదేసమయంలో, మాస్కులు లేకుండా వీధుల్లో తిరిగేవారికి భారీగా జరిమానా (35 వేల డాలర్లు) విధించింది. దాంతో ప్రజలు ఇంటిపట్టునే ఉండి కరోనా సంక్రమణ జరుగకుండా ప్రభుత్వానికి సాయపడ్డారు.

"కొవిడ్ సంక్రమణ జరుగకుండా ఇప్పటివరకు అడ్డుకున్న ఏకైక దేశం తైవాన్" అని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ పీటర్ కొల్లిగ్నాన్ చెప్పారు. ఆస్ట్రేలియాతో సమానమైన జనాభాను కలిగివున్నప్పటికీ.. కరోనాను సమర్థంగా అడ్డుకోగలిగారని ఆయన అభిప్రాయపడ్డారు. 2020 లో స్థూల జాతీయోత్పత్తి 1.56 శాతం విస్తరిస్తుందని ఆగస్టులో ప్రభుత్వం అంచనా వేయడంతో.. ఈ ఏడాది వృద్ధి చెందుతున్న కొన్ని ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా తైవాన్‌ ఉండనున్నది. ఇప్పటికైతే తైవాన్‌లో కొత్త కేసులు లేవు. అయితే, ఫిలిప్పీన్స్, అమెరికా, ఇండోనేషియా నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్‌ నమోదైనట్లు  ప్రభుత్వం గురువారం ధ్రువీకరించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.