శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 23, 2020 , 15:39:05

మూడు నిమిషాల్లో మ్యూజియంలోని ఏడు లక్షలు కొట్టేశారు..! అచ్చం ఆ వంశస్థుల్లాగే..!!

మూడు నిమిషాల్లో మ్యూజియంలోని ఏడు లక్షలు కొట్టేశారు..! అచ్చం ఆ వంశస్థుల్లాగే..!!

టోక్యో: జపాన్‌లోని ప్రఖ్యాత ఇగా-ర్యూ మ్యూజియంను దేశంలోని నింజాస్‌ వంశ చరిత్రకు అంకితం చేశారు. అయితే, కొంతమంది దొంగలు ఇందులోకి దూరి ఒక మిలియన్ యెన్ల (జపాన్‌ కరెన్సీ)ను అంటే ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ. ఏడు లక్షలను దొంగిలించారు. అయితే, ఇదంతా చేయడానికి వారు తీసుకున్న సమయం కేవలం మూడు నిమిషాలేనట. 

దొంగలు దోచుకెళ్లిన యెన్ల బరువు దాదాపు 150 కిలోలట. ఇవి సుమారు 1000 మంది సందర్శకులనుంచి వసూలు చేసిన ప్రవేశ రుసుము. దోపిడీ జరిగిన రాత్రి ఒక కారు మ్యూజియం వద్దకు వచ్చింది. ఒక వ్యక్తి కారునుంచి దిగి సీసీ కెమెరాను కిందికి వంచేశాడు. ఎంచక్కా పనికానిచ్చారు. అయితే, మ్యూజియంలోని అలారం దొంగతనం ముగిసిన తర్వాత మోగింది. పోలీసులు వచ్చేసరికే అక్కడ డబ్బులతోపాటు దొంగలు కూడా కనిపించలేదు.

అయితే, ప్రాచీన జపనీస్‌ చరిత్రలో నింజాస్‌ భూస్వామ్య వర్గానికి చెందిన యోధులు. వారు వేగంగా దొంగతనం చేసేవారు. ఉన్నత తరగతికి చెందిన సమురాయ్‌లకు వీరు సేవ చేసేవారు. కాగా, ప్రస్తుతం జరిగిన దొంగతనం కూడా వారి స్టైల్లో ఉండడంతో ఇది చర్చనీయాంశమైంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo