సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 27, 2020 , 16:48:43

తొలి 50 మంది ఉద్యోగులకు గిఫ్ట్‌గా 1721.32 కోట్లు.. నికోలా వ్యవస్థాపకుడు బంప్ ఆఫర్

తొలి 50 మంది ఉద్యోగులకు గిఫ్ట్‌గా 1721.32 కోట్లు.. నికోలా వ్యవస్థాపకుడు బంప్ ఆఫర్

వాషింగ్టన్: అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్టార్టప్ కంపెనీ నికోలా వ్యవస్థాపకుడు, చైర్మన్ అయిన ట్రెవర్ మిల్టన్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తొలి 50 మంది ఉద్యోగులకు తనకు చెందిన 233 మిలియన్ డాలర్ల (రూ.1721.32 కోట్లు) విలువైన ఆరు లక్షల షేర్లు (ఒక్కొక్కరికి సుమారు 34.5 కోట్ల విలువైన షేర్లు) ఇస్తానని చెప్పారు. వారిని ఉద్యోగంలోకి తీసుకునే ముందు ఈ హామీ ఇచ్చానని, దీనిని తాను నెరవేర్చేతున్నట్లు ఆయన తెలిపారు. తాను ఈ కంపెనీని ఏర్పాటు చేసినప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం చూశానని, అలాంటి వారిని పొందటం చాలా కష్టమని ట్రెవర్ మిల్టన్ అన్నారు. ‘నేను నా ఉద్యోగులను ప్రేమిస్తాను. వారంతా నికోలాను గొప్పస్థాయికి తెచ్చారు. ఈ సంస్థ విజయానికి వారే కారణం. నేను నియమించిన తొలి 50 మంది ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నాను. నాకు చెందిన 6 లక్షల షేర్లను వారికి ఇస్తాను. వాటిని వారికి అమ్మడం లేదు. ఉచితంగా ఇస్తున్నాను. దీని వల్ల నా షేర్లు, సంపద తగ్గుతాయి’ అని గురువారం ట్వీట్ చేశారు. మనం మరింతగా పని చేస్తే భవిష్యత్తులో ఇది బిలియన్లకు చేరుతుందని చెప్పారు.

37 ఏండ్ల ట్రెవర్ మిల్టన్ ప్రపంచంలోని 500 మంది ధనవంతుల్లో ఒకరు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం షేర్ మార్కెట్‌లో ఆయన సంపద విలువ 4.6 బిలియన్ డాలర్లు. కాగా నికోలా కంపెనీ ఇప్పటి వరకు తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్‌లోకి ఇంకా విడుదల చేయలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo