శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 17:03:56

భారతీయ మహిళల్లో లైంగిక కోరికలు తక్కువ

భారతీయ మహిళల్లో లైంగిక కోరికలు తక్కువ

వాషింగ్టన్ : భారతీయ మహిళల్లో లైంగిక కోరికలు తక్కువగా ఉండటమే కాకుండా వారు ఆకర్షణీయంగా ఉండరు. ఇలాంటి వారు పిల్లల్ని ఎలా కంటారో?.. ఇది భారతీయ మహిళల పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అభిప్రాయం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజాగా వెలువడిన కొన్ని ఆడియో టేపుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్.. భారతీయ మహిళల గురించి అసభ్యకరంగా, కించపరిచేలా మాట్లాడినట్లు తెలుస్తున్నది.  

ఈ విషయాలను ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాల విభాగానికి చెందిన ప్రొఫెసర్ గ్యారీ జే బాస్.. న్యూయార్క్ టైమ్స్ దినపత్రికకు ఇచ్చిన ఒపీనియన్ పోల్ లో వెల్లడించారు. రిచర్డ్ నిక్సన్ అమెరికా 37వ అధ్యక్షుడిగా 1969 నుంచి 1974 వరకు పనిచేశారు. ఈ టేపులను రిచర్డ్ నిక్సన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ అండ్ మ్యూజియం విడుదల చేసింది. 1971 జూన్ 17 వ తేదీన సాయంత్రం 5:15-6:10 గంటల మధ్య జరిగిన సమావేశంలో భాగంగా నిక్సన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిని ఓవల్ ఆఫీస్ టేపింగ్ సిస్టమ్ రికార్డ్ చేసింది. ఈ టేప్స్‌ను గ్యారీ జే బాస్ తాను రచించిన ‘ది బ్లడ్ టెలిగ్రామ్’ పుస్తకంలో కూడా ప్రస్తావించారు.

భారతీయుల పట్ల నిక్సన్‌లో ఉన్న వ్యతిరేకతకు అప్పటి జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిస్సింజర్ వీరాభిమాని అని గ్యారీ బాస్‌ తెలిపారు. భారతీయ మహిళలను నిక్సన్ నల్లజాతి మహిళలతో పోల్చారు. ‘నా ఉద్దేశ్యం ఏమిటంటే, బ్లాక్ ఆఫ్రికన్లలో కొద్దిగా ఆకర్షణ ఉంటుంది. కానీ భారతీయ మహిళలు చూడటానికి అందవిహీనులుగా ఉంటారు’ అని నిక్సన్ పేర్కొన్నారు. 1971 నవంబర్ 4 న అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో మాట్లాడుతుండగా ‘నాకైతే వారు అస్సలు నచ్చరు. మిగిలిన వ్యక్తులకు ఎలా నచ్చుతారో తెలియడం లేదు’ అని నిక్సన్ చెప్పినట్లు విన్నానని బాస్ స్పష్టం చేశారు.

నిక్సన్ వ్యాఖ్యలు అంతర్జాతీయ సంఘటనలు, నటుల పట్ల నిక్సన్‌ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. వ్యక్తిగత జాత్యహంకారం, భారతీయుల పట్ల అతడి వ్యతిరేకతను ఈ టేపులు వెల్లడిస్తున్నాయి. తూర్పు పాకిస్తాన్ లోని బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాల విషయలో కూడా నిక్సన్ సానుకూల వైఖరిని కలిగి ఉండటమే కాకుండా భారత్ పట్ల ఎంతటి శత్రుత్వం కలిగి ఉన్నారో కూడా ఈ టేపులు స్పష్టం చేస్తున్నాయి. 

మరొక సందర్భంలో.. 1971 నవంబర్ 12 న, కిస్సింజర్, అతడి విదేశాంగ కార్యదర్శి విలియం పీ రోజర్స్ తో భారత్-పాకిస్తాన్ యుద్ధం గురించి చర్చిస్తున్నప్పుడు.. "ఇండియన్స్ ఎలా పునరుత్పత్తి చేస్తారో నాకు తెలియదు!" అని నిక్సన్ అన్నట్లుగా టేపుల ద్వారా తెలుస్తున్నది.


logo