సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 31, 2020 , 15:48:17

చైనాలో కొత్తగా 127 కరోనా కేసులు

చైనాలో కొత్తగా 127 కరోనా కేసులు

చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా ఇటీవల తిరిగి వాటి సంఖ్య పెరుగుతోంది. ఉయ్ఘర్ జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ 127 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల నుంచి 120కి పైగా కేసులు నమోదవుతున్నాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) శుక్రవారం తెలియజేసింది. ఇందులో 123 కేసులు దేశానికి చెందినవిగా గుర్తించారు. 

గతేడాది డిసెంబర్‌లో చైనాలోని వుహాన్ నగరంలో వైరస్ వ్యాప్తి మొదలు కాగా ఆ తరువాత వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఒక్క జిన్జియాంగ్‌లోనే 112 కేసులు నమోదు కాగా, లియోనింగ్ ప్రావిన్స్ 11 కేసులు నమోదయ్యాయి. అయితే వ్యాధితో మరణించిన వారి వివరాలను ఎన్‌హెచ్‌సీ తెలుపలేదు. 

గురువారం నాటికి చైనాలో మొత్తం కేసుల సంఖ్య 84,292కు చేరింది. 684 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. 41 మందికి వ్యాధి తీవ్ర స్థాయిలో ఉంది. 78,974 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 4,634 మంది ఈ వ్యాధితో మరణించారని కమిషన్ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo