మంగళవారం 14 జూలై 2020
International - Jun 08, 2020 , 16:25:29

వైరస్‌పై విజయం సాధించాం.. అందుకే డాన్స్‌ చేశా..

వైరస్‌పై విజయం సాధించాం.. అందుకే డాన్స్‌ చేశా..

వెల్లింగ్టన్‌: న్యూజీలాండ్‌లో కరోనా వైరస్‌ మహమ్మారిని అదుపు చేసేందుకు విధించిన అన్నిరకాల చర్యలను అక్కడి ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్‌ ట్విట్టర్‌ ద్వారా దేశ ప్రజలతో పంచుకొని.. వైరస్‌పై విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా విజయానందంతో కొద్దిసేపు డ్యాన్స్ కూడా చేశానని ఆవిడ పేర్కొన్నది. సోమవారం నాడు చిట్టచివరి పేషెంట్‌ను డిశ్చార్జి చేసిన తర్వాత వైరస్‌ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. గత 17 రోజులుగా ఇక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్యాధికారులు తెలిపారు. దాంతో తమ దేశంలో కరోనా వైరస్‌ పారిపోయిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకొన్నారు.

5 మిలియన్లకు పైగా జనాభా కలిగిన న్యూజీలాండ్‌లో కేవలం 1,154 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 22 మంది మృత్యువాత పడ్డారు. దేశ సరిహద్దుల్లో కఠినంగా వ్యవహరించడం, ప్రజలు భౌతిక దూరం పాటించడం, అవసరమైన మేరకే ఇండ్ల నుంచి బయటకు రావడం వంటి చర్యల ద్వారా కరోనా వైరస్‌పై విజయం సాధించగలిగామని ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్‌ స్థానిక టెలివిజన్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇదంతా ప్రజలు ఐకమత్యంగా ఉండి ప్రభుత్వంతో సహకరించడం వల్లనే సాధ్యమైందని వెల్లడించారు. దేశంలో కరోనాపై విజయం సాధించామని ప్రకటించిన తర్వాత ఆనందం పట్టలేక తన లివింగ్‌రూంలో డాన్స్‌ చేశానని ఆర్డెర్న్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఇలాఉండగా, ఏడు వారాలపాటు కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించి కరోనా వైరస్‌ను తరిమేయడంతో ప్రజలు ఉత్సవాలు జరుపుకొన్నారు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ న్యూజీలాండ్‌ రగ్బీ (ఎన్‌జెడ్‌ఆర్‌) ను ప్రారంభించేందుకు నిర్వాహకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


logo