శనివారం 06 జూన్ 2020
International - Apr 17, 2020 , 12:06:06

కరోనాపై విజయకేతనం ఎగురవేసే మలుపులో న్యూజీల్యాండ్

కరోనాపై విజయకేతనం ఎగురవేసే మలుపులో న్యూజీల్యాండ్

హైదరాబాద్: రేపు ఎన్నడైనా కరోనావైరస్ విశ్వమహమ్మారి గురించి రాయాల్సి వస్తే అందులో న్యూజీల్యాండ్‌కు తప్పనిసరిగా సముచిత స్థానం దక్కుతుందని చెప్పవచ్చు. ఈ దక్షిణ పసిఫిక్ దేశం కరోనా వైరస్‌ను తుదముట్టించే పోరులో అగ్రగామిగా నిలిచింది మరి. కనీసం ఒక మరణం కూడా సంభవించకముందే న్యూజీల్యాండ్ కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేసింది. బాధితులను వేరు చేసి వ్యాప్తికి అడ్డుకట్టలు వేసింది. ఈ చర్యల తొలిఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కొత్తకేసులు కనీసం స్థాయికి పడిపోయాయి. మరణాల సంఖ్య కేవలం 11. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే కనిష్టం. లాక్‌డౌన్ ఎత్తివేతపై ప్రధాని జాసిండా ఆర్డెన్ సోమవారం నిర్ణయం తీసుకుంటారు. 'ఇప్పటిదాకా ఏ దేశానికి వల్లకానిది.. అంటే వైరస్ అంతాన్ని సాధించే అవకాశాన్ని మేం దక్కించుకోబోతున్నాం' అని వెల్లింగ్టన్‌లో ఆర్డెన్ మీడియాతో అన్నారు. అయితే ఈ ద్వీపదేశం సాధించనున్న ఈ మహావిజయం ఊరికే రాలేదు. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని విమర్శకులు అంటున్నారు. వైరస్ భయం వల్ల సుదీర్ఘకాలం దేశాన్ని మూసిఉంచాలి. టూరిజం ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న న్యూజీల్యాండ్‌కు ఇది చాలా నష్టదాయకమని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ మార్చి 23న నాలుగు వారాల లౌక్‌డౌన్ ప్రకటించిన ప్రధాని వైరస్‌ను మొత్తం మీద అదుపు చేయగలిగారు.


logo