బుధవారం 27 మే 2020
International - Apr 08, 2020 , 13:01:37

ఘోస్ట్‌ సిటీ (దయ్యాల నగరం)ని తలపిస్తున్నన్యూయార్క్‌

ఘోస్ట్‌ సిటీ (దయ్యాల నగరం)ని తలపిస్తున్నన్యూయార్క్‌

న్యూయార్క్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. పెద్ద సంఖ్యలో మరణాలు నమోదవుతుండటంతో శవాలను భద్రపరచడం, ఖననం చేయడం నగర అధికారులకు పెను సవాలుగా మారుతున్నది.  శవాల ద్వారా వైరస్‌ సోకే ప్రమాదం ఉండటంతో  కొన్నింటిని ప్రభుత్వమే ఖననం చేస్తున్నది. మరికొన్నింటిని లేపనాలు రాసి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శవాగారాల్లో భద్రపరుచుతున్నారు. ఒకేసారి వందల సంఖ్యలో మృతదేహాలు రావడంతో  దవాఖానల్లో భద్రపరిచే స్థలంలేక రిఫ్రిజిరేటర్‌ ట్రక్కుల్లో శవాలను ఉంచాల్సిన పరిస్థితి నెలకొన్నది. దవాఖానలు, మార్చురీలు, ఫ్రీజర్‌ ట్రక్కులు, శ్మశాన వాటికలు అన్నీ కరోనా మృతులతో నిండిపోయాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శవాలను పేటికల్లో ఉంచి ఒకేసారి వరుసగా పదింటిని భూమిలో ఖననం చేయడం వల్ల శవాలు ఒకేసారి పేరుకుపోకుండా ఉండటంతో పాటు తక్కువ మేర తవ్వకంతోనే అంత్యక్రియలు పూర్తవుతాయని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

శవాల సామూహిక ఖననం కోసం చారిత్రక హార్ట్‌ ఐలాండ్‌ను పరిశీలిస్తున్నామని అధికారులు ప్రకటించారు. హార్ట్‌ ఐలాండ్‌ చారిత్రకమైనది. 1864లో ఆర్మీ  శిక్షణ కేంద్రంగా ఉండేది. 1985లో పెద్ద ఎత్తున మరణించిన హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ రోగుల శవాలను ఇక్కడ పూడ్చారు. 2012లో సాండీ హరికేన్‌ వచ్చినపుడు ఇది ధ్వంసమై గతంలో పూడ్చిన శవాల తాలూకు బొక్కలు, పుర్రెలు భారీ ఎత్తున బయటపడ్డాయి. న్యూయార్క్‌ కౌన్సిల్‌ ప్రస్తుతం దీనిని నగర పార్కులు, వినోద కేంద్రాల విభాగం పరిధిలోకి తీసుకువచ్చింది. నిద్ర ఎరుగని నగరం (సిటీ ఆఫ్‌ నెవర్‌ స్లీప్స్‌)గా పేరుగాంచిన న్యూయార్క్‌ ప్రస్తుతం ఘోస్ట్‌ సిటీ (దయ్యాల నగరం)ని తలపిస్తున్నది. అధిక జనసాంద్రత ఆ నగరానికి శాపంగా మారింది. కరోనా దెబ్బకు రోజూ వందలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు.


logo