మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 22:23:51

చైనాను వణికిస్తున్న మరో కొత్త వైరస్

చైనాను వణికిస్తున్న మరో కొత్త వైరస్

బీజింగ్ : మరో వైరస్ వ్యాప్తి చైనా ప్రజలను కలవరానికి గురిచేస్తున్నది. దీని పేరు ఎస్ఎఫ్టీఎస్ వైరస్. దీనిని బున్యా వైరస్ అని కూడా అంటారు. ఇది సాలీడు లాంటి జీవి అయిన టిక్ కాటు ద్వారా వ్యాపిస్తుంది. చైనాలో ఇప్పటివరకు 60 మందికి వైరస్ సోకగా ఏడుగురు మరణించారు. చైనా మీడియా ప్రకారం.. తూర్పు చైనాకు చెందిన జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన 37 మందికి గత ఆరు నెలల్లో ఎస్‌ఎఫ్‌టీఎస్ వైరస్ సోకింది. తదనంతరం తూర్పు చైనాలోని అన్హుయి ప్రావిన్స్‌లో 23 మంది సోకినట్లు గుర్తించారు.

జియాంగ్‌సు రాజధాని నాన్జింగ్‌లో ఒక మహిళకు వైరస్ సోకింది. ఆమెలో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపించాయి. ఆమె శరీరంలో ల్యూకోసైట్, బ్లడ్ ప్లేట్‌లెట్స్ తగ్గడం కూడా కనిపించింది. నెల రోజుల చికిత్స తర్వాత దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని జెజియాంగ్ విశ్వవిద్యాలయ దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్ షెంగ్ జిఫాంగ్ చెప్పారు. వైరస్ సోకిన రోగి యొక్క రక్తం, చెమట ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిస్థితి అదుపులో ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.

ఎస్‌ఎఫ్‌టీఎస్ వైరస్ కొత్తది కాదు

చైనా మీడియా ప్రకారం, ఎస్‌ఎఫ్‌టీఎస్ వైరస్ కొత్తది కాదు. 2011 లో శాస్త్రవేత్తలు ఈ వైరస్ను వేరు చేశారు. ఎస్‌ఎఫ్‌టీఎస్ వైరస్ బన్యావైరస్ వర్గానికి చెందినది. చైనాలోని నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ వైరస్ సోకిన వ్యక్తి యొక్క రక్తం, చెమట ద్వారా ఇతర మానవులకు వ్యాపిస్తుంది. జ్వరం, ప్లేట్‌లెట్స్, ల్యూకోసైట్లు వేగంగా పడిపోవటం ప్రధాన లక్షణాలు. చైనా ఆరోగ్య సంస్థ సీడీసీ ప్రకారం.. ఈ వైరస్ సోకినట్లయితే మరణించే ప్రమాదం 12 శాతం వరకు ఉంటుంది. కాగా, ఈ వైరస్ నివారణకు ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు.


logo