శనివారం 28 నవంబర్ 2020
International - Oct 19, 2020 , 15:23:29

జబ్బు నయం కాని పిల్లల్ని చంపేయండి

జబ్బు నయం కాని పిల్లల్ని చంపేయండి

అమెస్టర్‌డామ్‌ : ప్రపంచంలోని ఏ దేశమూ తీసుకునేందుకు సాహసం చేయని నిర్ణయాన్ని నెదర్లాండ్స్‌ ప్రభుత్వం తీసుకున్నది. ఏ ప్రభుత్వమూ తీసుకురాని చట్టాన్ని డచ్‌ ప్రభుత్వం రూపొందించింది. డచ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై వైద్యరంగంలో తీవ్రమైన చర్చకు దారితీసింది. తీవ్రమైన జబ్బుకు గురై కోలుకునేందుకు అవకాశం లేని ఒకటి నుంచి 12 ఏండ్ల వయసులోని చిన్నారులను నిర్దాక్షిణ్యంగా చంపేయడమే ఈ కొత్త చట్టం ఉద్దేశం.

నయం చేయలేని లేదా తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల జీవితాలను అంతం చేయడానికి నెదర్లాండ్స్ యొక్క డచ్ ప్రభుత్వం వైద్యులను అనుమతించింది. ఇప్పుడు వైద్యులు అటువంటి జబ్బుపడిన పిల్లల జీవితాలను వారి స్వంత మార్గంలో ముగించేందుకు వీలుపడుతుంది. అయితే, దీని కోసం వైద్యులు పిల్లల తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తీవ్రంగా జబ్బుపడిన పిల్లలను డ్రగ్స్ ద్వారా సజీవంగా ఉంచుతున్న కొన్ని సంస్థలు వారికి ఎందుకు అలాంటి మరణం ఇవ్వాలని ప్రశ్నిస్తున్నాయి. అయితే చాలా మంది నిపుణులు, చట్టసభ సభ్యులు ఈ కొత్త చట్టానికి మద్దతు పలుకుతున్నారు.  వాస్తవానికి, నెదర్లాండ్స్‌లో ఒక సంవత్సరం వరకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు చనిపోయేందుకు అవకాశం ఉన్నది.

అనారోగ్యంతో ఉన్న పిల్లలకు చనిపోయేందుకు అవకాశం ఇవ్వడానికి చట్టాన్ని పొడిగించాలని డచ్ ఆరోగ్య మంత్రి హ్యూగో డీ జోంగ్ ప్రతిపాదించారు. ఫలితంగా ఏడాది నుంచి 12 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలను కొత్త చట్టంలో చేర్చారు. 'కొంతమంది పిల్లలు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు. వారు ఏ విధంగానూ కోలుకునేలా లేరు. వారు అనవసరంగా బాధపడుతున్నారు. ప్రతి ఏటా అలాంటి 5 నుంచి 10 మంది పిల్లలు ప్రభావితమవుతున్నారు' అని పార్లమెంట్లో మాట్లాడుతూ హ్యూగో డీ జాంగో చెప్పారు. 'ఒక పిల్లవాడు భరించలేని, నిరాశాజనకమైన బాధలను' అనుభవిస్తుంటే అతడి జీవితాన్ని అంతం చేయవచ్చు. ఇది వైద్య రంగానికి సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ చట్టం ఆమోదం పొందింది. 'కోలుకునేందుకు అవకాశం లేని పిల్లలకు వైద్య సహాయంతో మరణం ఇవ్వడానికి నెదర్లాండ్స్ ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది' అని నిపుణులు చెప్తున్నారు.

యురోపియన్‌ దేశాలైన లక్సెంబర్గ్, బెల్జియం, స్విట్జర్లాండ్ దేశాల్లో.. ప్రతి దేశంలో చట్టాలు భిన్నంగా ఉన్నప్పటికీ.. వైద్యుల సహాయంతో మరణానికి అనుమతి ఇస్తున్నారు. బెల్జియం డాక్టర్ సహాయంతో పిల్లలు చనిపోవడానికి అనుమతిస్తుండగా.. లక్సెంబర్గ్‌లో ఈ చట్టం నయం చేయలేని జబ్బుపడిన పెద్దలకు మాత్రమే పరిమితం చేశారు. 'ఈ కొత్త చట్టం నెదర్లాండ్స్ వంటి చిన్న దేశాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే, అమెరికా వంటి పెద్ద దేశాలపై ఈ చట్టం ఒత్తిడిని పెంచుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ వారి సమ్మతి ఇవ్వలేని వృద్ధులకు సంబంధించి చిక్కులు వస్తాయి' అని అమెరికాలోని న్యూయార్క్ లాంగన్ మెడికల్ సెంటర్ ప్రొఫెసర్ ఆర్థర్ కప్లాన్ అభిప్రాయపడుతున్నారు. అమెరికా లేదా ఇతర పెద్ద దేశాలు నెదర్లాండ్స్ చట్టాన్ని అనుసరిస్తాయన్నది పెద్ద అనుమానమే. డచ్ పౌరుల కంటే అమెరికన్లు తమ వైద్య విధానాలపై తక్కువ ఆధారపడతారు. అందరికీ మంచి ఆరోగ్య సౌకర్యాలు లేని అమెరికాలో ఈ చట్టం సమస్యగా మారుతుందనడంలో ఎలాంటి ఔచిత్యం లేదు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.