గురువారం 29 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 01:07:20

వైరస్‌ ఎక్కించి.. టీకా వేస్తారు!

వైరస్‌ ఎక్కించి.. టీకా వేస్తారు!

  • బ్రిటన్‌ పరిశోధకుల ఛాలెంజ్‌ ట్రయల్స్‌ 
  • వ్యాక్సిన్‌ సమర్థత కచ్చితంగా తెలుస్తుందని వెల్లడి 
  • జనవరిలో ప్రయోగాలు ప్రారంభం 

లండన్‌, సెప్టెంబర్‌ 24: ఆరోగ్యవంతులకు కరోనా వైరస్‌ను సంక్రమింపజేసి చేసి ఆ తర్వాత టీకా వేసి.. తద్వారా టీకా సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి బ్రిటన్‌ శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. ‘ఛాలెంజ్‌ ట్రయల్స్‌' పేరిట నిర్వహించనున్న ఈ ప్రయోగాలు జనవరిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. తొలుత ఆరోగ్యవంతులైన వలంటీర్లకు (పరీక్షల కోసం స్వచ్ఛందంగా వచ్చినవారికి) వైరస్‌ను సోకేలా చేసే ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను ఎక్కిస్తారు. దీంతో నెల రోజుల్లోగా వాళ్లు కరోనాబారిన పడుతారు. ఆ తర్వాత వారికి వైరస్‌ను కట్టడి చేసే టీకా ఇస్తారు. దీంతో టీకా పనితీరు కచ్చితంగా తెలుస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయంతో చేపట్టనున్న ఈ ‘ఛాలెంజ్‌ ట్రయల్స్‌'ను.. తూర్పు లండన్‌ సమీపంలో గల వైట్‌చాపెల్‌లోని అత్యంత భద్రత కలిగిన ప్రదేశంలో నిర్వహించనున్నారు. ఈ ట్రయల్స్‌లో దాదాపు 2 వేల మంది వలంటీర్లు పాల్గొననున్నట్టు ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్న అమెరికాకు చెందిన ‘1డే సూనర్‌' అనే సంస్థ వెల్లడించింది. వలంటీర్లకు వేల పౌండ్లను చెల్లించనున్నట్టు పేర్కొంది. ‘ఛాలెంజ్‌ ట్రయల్స్‌'ను బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ నిర్వహిస్తున్నట్టు ప్రాథమికంగా తెలుస్తున్నది. కరోనా వైరస్‌పై పరిశోధనల్లో భాగంగా ఇప్పటికే వివిధ సంస్థల భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నామని ఇంపీరియల్‌ కాలేజ్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

గతంలోనూ ఇటువంటిప్రయోగాలు.. 

సాధారణ క్లినికల్‌ ట్రయల్స్‌లో వలంటీర్లపైన వ్యాక్సిన్‌ ప్రయోగించి.. వారి శరీరంలో వృద్ధిచెందే యాంటీబాడీల స్థాయిని అంచనా వేస్తారు. అయితే, ‘ఛాలెంజ్‌ ట్రయల్స్‌'లో పాల్గొనే వలంటీర్లకు ఉద్దేశపూర్వకంగా వైరస్‌ను ఎక్కిస్తారు. ఆ తర్వాత వ్యాక్సిన్‌ ఇచ్చి దాని సమర్థతను పరీక్షిస్తారు. గతంలో టైఫాయిడ్‌ వ్యాక్సిన్‌ను ఇదే రకంగా అభివృద్ధి చేశారు.

రష్యాలో ప్రజల చెంతకు కరోనా టీకా 

మాస్కో: కరోనా కట్టడికి రష్యా పరిశోధకులు అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్‌-వీ’ వ్యాక్సిన్‌ ప్రజా వినియోగంలోకి వచ్చింది. ఈ మేరకు గురువారం ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. తొలిదఫా టీకా డోసులు రాజధాని మాస్కోలో ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొంది. గమలేయా సంస్థ, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ‘స్పుత్నిక్‌-వీ’ వ్యాక్సిన్‌ను తయారుచేయడం తెలిసిందే.


logo