బుధవారం 27 మే 2020
International - Apr 17, 2020 , 08:56:59

గండం గట్టెక్కాం!

గండం గట్టెక్కాం!

  • కొత్త కేసులు తగ్గుతున్నాయి
  • ఈ నెలలోనే ఆంక్షల ఎత్తివేత దిశగా చర్యలు: ట్రంప్‌ 

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 16: దేశంలో కొత్త వైరస్‌ కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఒక్కరోజులోనే అత్యధిక కేసులు నమోదయ్యే స్థితి నుంచి బయటపడ్డామన్నారు. అన్ని కుదిరితే ఈ నెలలోనే ఆంక్షలన్నీ తొలిగిపోయి కొన్ని రాష్ర్టాలు మళ్లీ తెరుచుకునే అవకాశమున్నదని అంచనా వేశారు. దేశంలో కరోనా పరిస్థితులపై శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. కరోనాతో యుద్ధం కొనసాగుతున్న ట్రంప్‌, దేశాన్ని తిరిగి తెరిచేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాల్ని ఈ గురువారం ప్రకటించే అవకాశం ఉన్నదని అననారు. అయితే, గవర్నర్లతో సమావేశమైన తర్వాతనే ఈ వివరాల్ని వెల్లడిస్తామని చెప్పారు. 

కొన్ని దేశాలవి తప్పుడు లెక్కలు

ప్రపంచంలో నమోదైన మొత్తం కరోనా మరణాల్లో అమెరికాలోనే అధికంగా సంభవించడానికి కారణమేంటన్న ప్రశ్నకు ట్రంప్‌ సమాధానమిస్తూ.. వైరస్‌ మరణాల సంఖ్యను కొన్ని దేశాలు తక్కువ చేసి తప్పుగా చెబుతున్నాయని ఆరోపించారు. ఆయా దేశాల్లో రికార్డయిన మరణాల సంఖ్యను ఎవరైనా నమ్ముతారా? అని చైనాను ఉద్దేశిస్తూ ఎదురు ప్రశ్నించారు. ఇతర దేశాలతో పోలిస్తే అత్యంత కచ్చితమైన ఫలితాలతో పరీక్షల్ని చేస్తున్నామని, ఇప్పటివరకూ 33 లక్షల మందికి వైరస్‌ పరీక్షల్ని జరిపినట్టు వెల్లడించారు. గతంలో వైరస్‌బారిన పడి క్రమంగా రోగనిరోధక శక్తిని పెంచుకున్న వ్యక్తులను గుర్తించే పరీక్షల్ని అబోట్‌ ల్యాబ్స్‌ అభివృద్ధి చేసిందని, వారాల వ్యవధిలో దాదాపు రెండు కోట్ల మందికి ఈ పరీక్షల్ని నిర్వహించవచ్చని ట్రంప్‌ తెలిపారు. ఇదో గొప్ప పరీక్షగా ఆయన అభివర్ణించారు. 

9 రాష్ర్టాల్లో వెయ్యిలోపే కేసులు

శ్వేతసౌధంలోని కరోనా వైరస్‌ కార్యదళం సభ్యుడు డా. డీబోరా బ్రిక్స్‌ మాట్లాడుతూ.. గత ఐదారు రోజులుగా దేశంలో కరోనా కొత్త కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తున్నదన్నారు. తొమ్మిది రాష్ర్టాల్లో వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదు అయ్యాయని, కానీ, మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపించడంలేదని చెప్పారు.  


logo