శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 05, 2020 , 07:42:37

తండ్రికి కరోనా కాటు..కొడుకుపై మృత్యువు వేటు!

తండ్రికి కరోనా కాటు..కొడుకుపై మృత్యువు వేటు!
  • చైనాలో కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన ‘కరోనా’ వైరస్‌.. 426కు చేరిన మృతులు
  • చైనీయులకు ఇదివరకు జారీచేసిన వీసాల్ని రద్దు చేసిన భారత్‌

బీజింగ్‌: ప్రాణాంతక ‘కరోనా’ వైరస్‌ సృష్టిస్తున్న కల్లోలంతో చైనాలోని కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ‘కరోనా’ లక్షణాలు కనిపించడంతో ఓ తండ్రి నిర్బంధ చికిత్స కేంద్రంలోకి వెళ్లగా.. నిస్సహాయ స్థితిలో అతడి కుమారుడు ఆకలితో అలమటించి మృత్యుఒడిలోకి చేరిన హృదయ విదారక ఘటన చైనాలోని హోంగన్‌ కౌంటీలో చోటుచేసుకున్నది. యాన్‌ జియోవెన్‌కు యాన్‌చెంగ్‌ అనే 17 ఏండ్ల కొడుకున్నాడు.  పుట్టుకతోనే సెరబ్రల్‌ పాల్సీ వ్యాధి రావడంతో యాన్‌చెంగ్‌.. కదలలేడు, మాట్లాడలేడు, తనకు తానుగా తినలేడు, ఏ పని చేసుకోలేడు. కేవలం చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. ఇదివరకే భార్య చనిపోవడంతో కొడుకును జియోవెన్‌ అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. ఇటీవల జియోవెన్‌ ‘కరోనా’ వెలుగు చూసిన వుహాన్‌లో పర్యటించాడు. దీంతో అతన్ని గతనెల 22న అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లో అతడికి కరోనా సోకినట్లు నిర్ధారించిన వైద్యులు అతన్ని దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డ్‌లో ఉంచారు. 


తండ్రికి దూరమైన యాన్‌చెంగ్‌ ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. అయితే, కొడుకు పరిస్థితిని వివరిస్తూ, అతనికి ఎవరైనా ఆహారం పెట్టాలని, సాయం చేయాలని అభ్యర్థిస్తూ జియోవెన్‌ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. తన కుమారుడి ఆకలి తీర్చండంటూ బంధువులు, స్థానికులను అభ్యర్థించాడు. అయితే అప్పటికే చాలా ఆలస్యమైంది. తండ్రి దవాఖానకు వెళ్లినప్పటి నుంచి ఆహారం లేక జనవరి 29నే యాన్‌చెంగ్‌ కన్నుమూశాడు. యాన్‌ మృతికి గల కారణాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించినప్పటికీ ఆకలితో అలమటించే అతడు చనిపోయినట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో స్థానిక కమ్యూనిస్ట్‌ పార్టీ సెక్రటరీ, హోంగన్‌ కౌంటీ మేయర్‌ను ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. మరోవైపు, చైనాలో ‘కరోనా’ నానాటికీ తీవ్రమవుతున్నది. వైరస్‌తో మరణించిన వారి సంఖ్య సోమవారంనాటికి 426కు చేరింది. సోమవారం ఒక్కరోజే 64 మంది మృత్యువాత పడ్డారు.  20,438 మందికి  ఈ వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది.


జారీ చేసిన వీసాలు రద్దు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భారత్‌ మరిన్ని చర్యల్ని తీసుకుంటున్నది. చైనీయులకు, గత రెండు వారాల్లో ఆ దేశంలో పర్యటించిన ఇతర దేశస్థులకు ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేస్తున్నట్టు మంగళవారం కేంద్రం ప్రకటించింది. మరోవైపు, కరోనా సోకి తమ దేశంలో ఓ వ్యక్తి మరణించాడని హాంకాంగ్‌ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ-హాంకాంగ్‌ మధ్య నడుస్తున్న తమ విమాన సర్వీసుని ఫిబ్రవరి 8 నుంచి రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది.


టికెట్‌ రద్దు చేసుకుంటే పైసలు వాపస్‌..

టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే టికెట్‌కు అయిన మొత్తాన్ని ఎలాంటి చార్జీలు లేకుండా తిరిగి ఇస్తామని ప్రముఖ విమానయాన సంస్థ గో ఏయిర్‌ ప్రకటించింది. ఈ ప్రకటన సింగపూర్‌, బ్యాంకాక్‌, ఫుకెట్‌ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు వర్తిస్తుందని తెలిపింది. అదేవిధంగా ఫిబ్రవరి 29 లోపు పైన పేర్కొన్న మూడు దేశాల నుంచి భారత్‌ రావడానికి గో ఏయిర్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్న వారికి కూడా వర్తిస్తుందని పేర్కొంది. 


వెయ్యి పడకల దవాఖాన ప్రారంభం

కరోనా వైరస్‌ బాధితుల కోసం చైనాలోని వుహాన్‌ నగరంలో కేవలం పది రోజుల్లో నిర్మించిన దవాఖాన ప్రారంభమైంది. వైరస్‌ ప్రభావిత మొదటి బ్యాచ్‌ రోగులను అధికారులు సోమవారం దవాఖానలోని ప్రత్యేక వార్డుల్లో చేర్చి చికిత్సనందించారు. మంగళవారం మరో విడత రోగుల్ని దవాఖాన వార్డుల్లో చేర్చారు. 1000 పడకల సామర్థ్యం కలిగిన ఈ దవాఖానలో 1,400 మంది వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ దవాఖానలో 30 ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. దవాఖానలోని వైద్యులు బయటి వైద్య నిపుణులతో మాట్లాడేందుకు వీడియో సమాచార వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచారు. 


logo