గురువారం 09 జూలై 2020
International - Jun 13, 2020 , 22:17:16

ఆ వివాదాస్ప‌ద నేపాలీ మ్యాప్ ఇదే..

ఆ వివాదాస్ప‌ద నేపాలీ మ్యాప్ ఇదే..

హైద‌రాబాద్‌: ఈ మ్యాప్ చూశారా ? భార‌త్‌, నేపాల్, చైనా స‌రిహ‌ద్దుల్లో ఉన్న కాలాపాని.. ఇప్పుడు వివాదాస్ప‌ద స్థలంగా మారింది.  భార‌త్ త‌న మ్యాప్‌లో.. ఈ ప్రాంతాలు త‌న‌వ‌ని పేర్కొన్న‌ది.  నేపాల్‌లో కూడా వివాదాస్ప‌ద కాలాపాని ప్రాంతం త‌మదే అని స్ప‌ష్టం చేసింది. దీని కోసం ఇవాళ పార్ల‌మెంట్‌లో బిల్లు కూడా పాస్ చేసింది.  ఆ బిల్లుతో అన్ని నేపాలీ పార్టీలు ఐక్య‌త‌ను చాటాయి.  కాలాపానీ, లిపులేఖ్‌, లింపియాదురా.. ఈ బోర్డ‌ర్ ప్రాంతాలే ఇప్పుడు ఇండియా, నేపాల్ మ‌ధ్య చిచ్చుపెడుతున్నాయి. 

కాలాపానీ మాదే అని నేపాల్ అంటున్న‌ది. కానీ బోర్డ‌ర్ మ్యాప్‌ను ఆ దేశం త‌ప్పుగా చూపిస్తున్న‌ట్లు భార‌త్ ఆరోపిస్తున్న‌ది. ఇటీవ‌ల ఈ రూటు నుంచే భార‌త్ ఓ కొత్త మార్గాన్ని నిర్మించింది. ఉత్త‌రాఖండ్‌ బోర్డ‌ర్‌లో ఉన్న ఈ ప్రాంతం నుంచి మాన‌స స‌రోవ‌రానికి వెళ్లేందుకు కొత్త దారి వేసింది. ఆ ప్ర‌య‌త్నాల‌ను నేపాల్ అడ్డుకుంటున్న‌ది. 1816లో జ‌రిగిన సుగౌలీ ఒప్పందం ద్వారా ఆ ప్రాంతం మాదే అని నేపాల్ వాదిస్తున్న‌ది. కాలాపానీ, లిపులేఖ్‌, లింపియాదురా ప్రాంతాలతో అప్ప‌ట్లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా ఆ మ్యాప్‌ను రూపొందించింది.

కానీ 1857లో బ్రిటీష్ స‌ర్వే ఆఫ్ ఇండియా ఓ కొత్త మ్యాప్‌ను రిలీజ్ చేసింది. దాని ప్ర‌కారం ఆ మూడు కీల‌క ప్రాంతాలు ఇండియాలోనే ఉన్నాయి. ఇక నేపాల్ త‌న అధికారిక తొలి మ్యాప్‌ను 1976లో రిలీజ్ చేసింది. ఆ దేశ తొలి మ్యాప్‌లో ఆ మూడు ప్రాంతాలు లేవు. నేపాల్‌కు నార్త్ఈస్ట్ర‌న్ కార్న‌ర్‌గా ఉన్న ఈ ప్రాంతాలు త‌మ‌వే అని ఆ దేశం అంటున్న‌ది.  బ్రిటీష్ స‌ర్వేయ‌ర్ల త‌ప్పు వ‌ల్ల బోర్డ‌ర్ స‌మ‌స్య ఇంకా అలాగే మిగిలిపోయిన‌ట్లు కొంద‌రు వాదిస్తున్నారు. కానీ కాలాపానీ వ‌ద్ద ఉన్న కాళీ న‌ది మ‌న వైపు నుంచి ప్ర‌వహిస్తున్న‌ది కాబ‌ట్టి, ఆ ప్రాంతం మ‌న‌దే అని భార‌త్ వాదిస్తున్న‌ది.

1962లో జ‌రిగిన సైనో ఇండియ‌న్ యుద్ధం స‌మయంలో.. కాలాపానీ ప్రాంతాన్ని భార‌త బ‌ల‌గాలు వాడుకునేందుకు ఆ దేశానికి ఇచ్చిన‌ట్లు కొన్ని ఆధారాల‌ను నేపాల్ చూపిస్తున్న‌ది. ఆ మూడు ప్రాంతాల్లో ఉన్న వారికి అండ‌గా నేపాల్ రాజ‌కీయ పార్టీలు సంఘ‌టితం అయ్యాయి. కానీ చిన్న దేశ‌మైన నేపాల్‌.. భార‌త్ మీద‌కు క‌త్తిదువ్వ‌డం అర్థంకాని సంద‌ర్భంగా మిగిలింది.  మూడ‌వ పార్టీ ప్ర‌మేయం వ‌ల్ల నేపాల్ అలా రెచ్చిపోతున్న‌ట్లు ఆర్మీ చీఫ్ న‌ర‌వాణే వ్యాఖ్యానించినా.. హిమాల‌య దేశం మాత్రం త‌మ పంథాను వీడ‌డం లేదు.  కాలాపానీ ఇప్పుడు మ‌రో లైన్ ఆఫ్ కంట్రోల్‌గా మారుతుందా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
logo