శనివారం 30 మే 2020
International - May 11, 2020 , 16:43:34

లిపులేఖ్ రోడ్డుపై భారత్‌కు నేపాల్ నిరసన

లిపులేఖ్ రోడ్డుపై భారత్‌కు నేపాల్ నిరసన

కఠ్మాండూ: చైనా సరిహద్దుల్లోని లిపులేఖ్ ప్రాంతంలో భారత్ రోడ్డు నిర్మాణం జరపడం పట్ల నేపాల్ అభ్యంతరం తెలిపింది. ఆ ప్రాంతం తన భూభాగంలోకి వస్తుందని నేపాల్ అంటున్నది. అయితే భారత్ ఆ వాదనను తిరస్కరించింది. లిపులేఖ్ పూర్తిగా భారత్ భూభాగంలోనిదేనని శనివారం స్పష్టం చేసింది. దీనిపై నేపాల్ తన నిరసనను వ్యక్తం చేసింది. కఠ్మాండూలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాట్రాను విదేశాంగ శాఖకు పిలిపించి విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావలీ దౌత్యపరమైన నిరసన లేఖను అందించినట్టు తెలిసింది. మిగతా వివరాలేవీ వెల్లడి కాలేదు. దీనిపై భారత్ అధికారుల నుంచి ఎలాంటి ధ్రువీకరణ వెలువడలేదు.

తక్షణమే భారత్‌తో సరిహద్దు చర్చలు జరపాలని భావిస్తున్నట్టు గ్యావలీ తెలిపారు. అందుకు కోవిడ్-19 మహమ్మారి అంతమయ్యేవరకు ఆగాల్సిన అవసరం లేదని  కూడా ఆయన అన్నారు. భారత్ తో వివాదం తేలిన తర్వాత చైనాతోనూ చర్చలు జరుపుతామని పార్లమెంటు అంతర్జాతీయ సంబందాల కమిటీకి చెప్పారని కఠ్మాండూ పోస్ట్ వెల్లడించింది. భారత్, నేపాల్, చైనా మూడుదేశాల కూడలి ప్రాంతంలో లిపులేఖ్ ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని ధార్చులా నుంచి లిపులేఖ్ వరకు రోడ్డును ఇండియా ప్రారంభించడం పట్ల నేపాల్ విచారం వ్యక్తం చేసింది. నేపాల్ భూబాగం గుండా ఆ రోడ్డు పోతుందని అంటున్నది. అయితే భారత్ దీనిని నిరాకరిస్తున్నది. 

ప్రధానమంత్రుల స్థాయి, విదేశాంగ కార్యదర్శుల స్థాయి.. ఇలా భారత్‌తో ఏస్థాయిలోనైనా చర్చలకు సిద్ధమేనని నేపాల్ మంత్రి గ్యావల్ అన్నారు. కైలాశ్-మానస సరోవర్ యాత్ర దూరాన్ని తగ్గించేందుకు భారత్ చేపట్టిన రోడ్డును శుక్రవారం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. కైలాశ్-మానసససరవర్ యాత్రకు ఇదివరకు ఉపయోగించిన మార్గంలోనే ఈ రోడ్డును నిర్మించామని విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. సరిహద్దు వివాదాలపై చర్చించుకునేందుకు భారత్, నేపాల్ దేశాలకు సువ్యవస్థిత యంత్రాంగం ఉన్నదని అన్నారు. నేపాల్‌తో సరిహద్దును ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని, మిగిలిపోయిన సరిహద్దు సమస్యలను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేది భారత్ అభిమతమని అనురాగ్ చెప్పారు. కోవిడ్ సంక్షోభం ముగిసిన తర్వాత చర్చలు జరపవచ్చని వివరించారు.


logo