బుధవారం 05 ఆగస్టు 2020
International - Jul 05, 2020 , 19:38:43

నేపాల్‌లో ఏం జరుగుతోంది?

నేపాల్‌లో ఏం జరుగుతోంది?

కాఠ్మండూ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి ఆ దేశ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ పూర్ణ చంద్ర థాపాతో ఆదివారం భేటీ అయ్యారు. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రధాని ఒలి తీరుపై అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపీ) మండిపడుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని ఆయనపై ఒత్తిడి పెంచుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రధాని ఒలి అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ప్రధాని పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని, పార్టీ స్టాండింగ్ కమిటీ నిర్ణయానికి తాను తల‌ఒగ్గేది లేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.


మరోవైపు ఆ దేశ రాష్ట్రపతి బిద్యా దేవి భండారితోనూ ఆదివారం ప్రధాని ఒలి సమావేశమయ్యారు. తనతోపాటు ఆమెను కూడా పదవి నుంచి దించేందుకు ఎన్పీపీ ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతిని కలిశారు. కాగా, అధికార ఎన్సీపీ ఈ ఆరోపణలని ఖండించింది. ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు పుష్ప కమల్ దహల్ ప్రచండ, మాధవ్ నేపాల్, జహనాలాత్ ఖనాల్ కూడా ఆదివారం రాష్ట్రపతి బిద్యాదేవితో భేటీ అయ్యారు. ఆమె తొలగింపునకు ఎన్పీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నది అవాస్తవమని చెప్పారు.


మరోవైపు అధికార పార్టీ అగ్ర నాయకత్వం మధ్య విభేదాలను తొలగించేందుకు మాజీ ప్రధాని ప్రచండ ప్రయత్నిస్తున్నారు. ఆదివారం బలూవతార్‌లోని ప్రధాని ఒలి అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో చర్చలు జరిపారు. అయితే ఎలాంటి పురోగతి లేకుండానే వారిద్దరి మధ్య సమావేశం ముగిసినట్లు తెలుస్తున్నది. ఇక ప్రధాని ఒలి భవిష్యత్తుపై చర్చించేందుకు 45 మంది సభ్యులున్న ఎన్పీపీ స్టాండింగ్ కమిటీ సోమవారం మరోసారి భేటీ కానున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని ఒలి అనూహ్యంగా ఆ దేశ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ పూర్ణ చంద్ర థాపాతో ఆదివారం సాయంత్రం భేటీ కావడం ప్రాధానత్య సంతరించుకున్నది. నేపాల్‌లో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతుండటంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడనున్నట్లు తెలుస్తున్నది.logo