మంగళవారం 19 జనవరి 2021
International - Dec 20, 2020 , 17:41:23

రెండు దశల్లో నేపాల్‌ జాతీయ ఎన్నికలు

రెండు దశల్లో నేపాల్‌ జాతీయ ఎన్నికలు

కాఠ్మండు: నేపాల్‌ జాతీయ ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. 2021 ఏప్రిల్‌ 30న తొలి దశ, మే 10న రెండో దశ పోలింగ్‌ జరుగుతుంది. ఈ మేరకు జాతీయ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ముఖ్య ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. పార్లమెంట్‌ను రద్దు చేయాలని ప్రధాని కేపీ శర్మ ఓలి చేసిన సిఫారసుకు నేపాల్‌ రాష్ట్రపతి బిద్యాదేవి భండారీ ఆదివారం ఆమోదం తెలిపారు. అనంతరం ప్రధాని ఓలి ఆ దేశ ముఖ్య ఎన్నికల కమిషనర్, ఇతర అధికారులను కలిశారు. జాతీయ ఎన్నికల నిర్వహణపై వారితో చర్చించారు. అధికార నేపాల్ క‌మ్యూనిస్ట్ పార్టీలో ఏర్ప‌డిన ముస‌లంతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి ఆదివారం ఏకంగా పార్ల‌మెంట్‌నే ర‌ద్దు చేశారు. ఉద‌యం జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో ఈ మేర‌కు తీర్మానం చేశారు. అనంతరం రాష్ట్రపతి బిద్యాదేవి భండారీని కలిసి పార్లమెంట్‌ రద్దుకు సిఫారసు చేయగా దానికి ఆమె ఆమోదం తెలిపారు. 

కీల‌క‌మైన నియామ‌కాలు చేయ‌డానికి పూర్తి అధికారం త‌న‌కు తానుగా క‌ట్ట‌బెట్టుకుంటూ గ‌త మంగ‌ళ‌వారం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వివాదాస్ప‌ద‌మైంది. బుధ‌వారం స‌మావేశ‌మైన పార్టీ స్టాండింగ్ క‌మిటీ ఈ ఆర్డినెన్స్‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని ప్ర‌ధాని ఓలిని డిమాండ్ చేసింది. మాజీ ప్ర‌ధాని పుష్ప క‌మ‌ల్ ద‌హ‌ల్ ప్ర‌చండ నేతృత్వంలోని వ్యతిరేక వర్గాన్ని బుజ్జగించేందుకు ఓలి చాలా ప్రయత్నాలు చేశారు. శనివారం ప్రచండ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఫలితం లేకపోవడంతో చివరకు పార్లమెంట్‌ను రద్దు చేశారు. దీంతో నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో జాతీయ ఎన్నికలు అనివార్యమయ్యాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.