ఆదివారం 09 ఆగస్టు 2020
International - Jul 02, 2020 , 14:49:37

నేపాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

నేపాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

కాఠ్మండూ: నేపాల్‌ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను ముగించాలని నిర్ణయించింది. ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలి నివాసంలో గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాలను ముగించాలని తీర్మానించారు. కాగా, మంత్రివర్గ సమావేశానికి ముందు ప్రధాని కేపీ శర్మ ఒలి ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారిని ఆమె నివాసంలో కలుసుకున్నారు. పార్లమెంట్‌ సమావేశాలను ముగించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి బిద్యాదేవి భండారి ఆమోదం తెలిపారు. పార్లమెంట్‌ కార్యదర్శికి ఈ మేరకు ఒక లేఖ పంపారు. మరోవైపు అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ గురువారం నిర్వహించిన స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి ప్రధాని కేపీ శర్మ గైర్హాజరయ్యారు. 

నేపాల్‌ పార్లమెంట్‌ ఆమోదించిన కొత్త పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన జనతా సమాజ్‌బాదీ పార్టీ (జేఎస్పీ) మంగళవారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మరోవైపు ప్రధాని పదవికి కేపీ శర్మ రాజీనామా చేయాలని అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన కొందరు నేతలు డిమాండ్‌ చేశారు. అయితే తనను ప్రధాని పదవి నుంచి దించేందుకు భారత్‌ ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. కాగా, బుధవారమే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని భావించిన కేపీ శర్మకు ఛాతిలో నొప్పి రావడంతో దవాఖానకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.  logo