శనివారం 06 జూన్ 2020
International - May 19, 2020 , 21:16:50

వివాదాస్పదంగా నేపాల్‌ కొత్త మ్యాప్‌

వివాదాస్పదంగా నేపాల్‌ కొత్త మ్యాప్‌

కాఠ్మండు: భారత్‌, నేపాల్‌ మధ్య సరిహద్దు వివాదం మళ్లీ తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న లిపులేఖ్‌, కాలాపాని, లింపియాధురా ప్రాంతాలు తమ పరిధిలోనివేనని నేపాల్‌ పేర్కొంటున్నది. తాజాగా రూపొందించిన ఆ దేశ మ్యాప్‌లో ఈ ప్రాంతాలను కూడా పొందుపర్చింది. ఈ మ్యాప్‌ను నేపాల్‌ క్యాబినెట్‌ కూడా ఆమోదించింది. కాలాపాని ప్రాంతం ఉత్తరాఖండ్‌లోని పిథోరాఘడ్‌ కిందకు వస్తుందని భారత్‌ పేర్కొంటుండగా.. ఈ ప్రాంతం తమ దేశంలోని ధర్చులా జిల్లా పరిధిలోకి వస్తుందని నేపాల్‌ చెప్తున్నది. అయితే గతేడాది భారత చిత్రపటాన్ని తిరిగి ముద్రించిన కేంద్ర ప్రభుత్వం కాలాపాని, లిపులేఖ్‌ ప్రాంతాలను అందులో పొందుపర్చింది. అప్పటి నుంచి ఈ సరిహద్దు వివాదం మొదలైంది. 

కొత్త రాజకీయ చిత్రపటాన్ని ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని క్యాబినెట్‌ ఆమోదించిందని నేపాల్‌ ఆర్థికశాఖ మంత్రి యువరాజ్‌ ఖతివడా చెప్పారు. కొత్త మ్యాప్‌ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని నేపాల్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రదీప్‌ కుమార్‌ గ్యావలీ తెలిపారు. కాగా, సరిహద్దు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్తున్న నేపాల్‌.. ఇలా మ్యాప్‌ను రూపొందించడంపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.


logo