శనివారం 23 జనవరి 2021
International - Dec 19, 2020 , 15:47:46

అన్న మోసాల దోవలో సోదరుడు.. అమెరికాలో వజ్రం చీటింగ్‌

అన్న మోసాల దోవలో సోదరుడు.. అమెరికాలో వజ్రం చీటింగ్‌

న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణంలో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ కూడా అన్న బాటలోనే పయనిస్తున్నారు. అమెరికాలో డైమండ్ మోసంలో నేహాల్‌ మోదీ చిక్కుకున్నారు. న్యూయార్క్‌లో హోల్‌సేల్ డైమండ్ విక్రేతకు రూ.10 కోట్ల విలువైన వజ్రాన్ని మోసం చేసినట్లు నేహాల్ మోదీపై ఆరోపణలు ఉన్నాయి. న్యూయార్క్ సుప్రీంకోర్టులో నేహాల్ మోదీ విచారణను ఎదుర్కోవలసి వస్తుందని ఆయనపై పోరాడుతున్న మాన్‌హటన్ జిల్లాకు చెందిన అటార్నీ సై వెన్ష్ జూనియర్‌ తెలిపారు. శుక్రవారం మాన్‌హటన్ సుప్రీంకోర్టులో నేహాల్ మోదీ తాను నిర్దోషి అని ప్రకటించుకున్నారు. ప్రస్తుతం నేహాల్ బెయిల్ అవసరం లేకుండానే విడుదలయ్యాడు. సుమారు రూ.7 వేల కోట్ల మేర మోసం చేసినట్లు కూడా నేహాల్ మోదీపై ఆరోపణలున్నాయి.

కోర్టు పత్రాల ప్రకారం.. ఎల్ఎల్డీ డైమండ్స్ సహకారంతో నేహాల్ మోదీ 2015 లో కాస్ట్కోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంపై జేమ్స్‌ను 2.6 మిలియన్‌ డాలర్లకు చూపించమని ఎల్‌ఎల్‌డీ డైమండ్స్‌ను ఒప్పించారు. దాని నుంచి 1.4 మిలియన్‌ డాలర్ల స్పార్క్లర్‌ను తీసివేసినట్లు మోదీపై ఆరోపణలు ఉన్నాయి. నేహాల్ ఈ డైమండ్ రింగ్‌ను పెద్ద డిస్కౌంట్‌కు విక్రయించారు. కాగా, ఇందులో 1.2 మిలియన్ డాలర్లను ఎల్‌ఎల్‌డీ డైమండ్స్‌కు నేహాల్ మోదీ తిరిగి ఇచ్చారు. మిగతా బకాయి మొత్తాన్ని అడిగిన సమయంలో.. కాస్ట్కో నుంచి డబ్బు అందలేదని నేహాల్ మోదీ తప్పుడు ప్రకటన చేశారు. దాంతో ఎల్‌ఎల్‌డీ డైమండ్స్‌ కోర్టును ఆశ్రయించింది. ఇది వాణిజ్య వివాదం అని, నేహాల్ ఎంతమాత్రమూ దోషి కాదని ఆయన తరపు న్యాయవాది రోజర్ బెర్న్‌స్టెయిన్ కోర్టుకు చెప్పారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo