కిడ్నాప్ చేసి.. మతం మార్చి.. పాకిస్థాన్‌లో అరాచకం

కరాచీ: పాకిస్థాన్ ముస్లిం మెజార్టీ దేశం. అక్కడ ఉన్న మైనార్టీలు కేవలం 3.6 శాతం మాత్రమే. వీళ్లలో హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు ఉన్నారు. ఆ కొద్ది శాతం మైనార్టీలను కూడా ప్రశాంతంగా ఉండనీయడం లేదు ఆ అరాచక దేశం. ఎంత దారుణం అంటే.. ప్రతి ఏటా పాకిస్థాన్‌లో 1000 మంది అమ్మాయిలను కిడ్నాప్ చేసి.. వాళ్ల మతం మార్చి.. పెళ్లి చేసుకుంటున్నారు. ఈ అరాచకానికి అక్కడి ఇస్లామిక్ మత పెద్దలు, మెజిస్ట్రేట్లు, పోలీసులు సహకరిస్తుండటం మరో దారుణం. ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ చేసిన సీక్రెట్ ఇన్వెస్టిగేషన్లో ఈ దారుణాలు వెలుగు చూశాయి.
14 ఏళ్ల అమ్మాయి.. 45 ఏళ్ల వ్యక్తితో పెళ్లి
నేహ అనే ఓ 14 ఏళ్ల అమ్మాయి క్రిస్టియన్. గతేడాది ఆమెను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి.. 45 ఏళ్ల ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. అతనికి అప్పటికే ఆమె కంటే రెట్టింపు వయసున్న పిల్లలు ఉన్నారు. ఎలాగోలా ఈ దారుణం బయటపడగా.. ఆమె భర్తను ఇప్పుడు జైల్లో వేశారు. అయినా అతని తమ్ముడు ఆమెను చంపడానికి ఏకంగా కోర్టులోకే గన్ పట్టుకొని రావడంతో నేహ భయపడి.. అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయింది. ఇలా నేహ ఒక్కతే కాదు. ప్రతి ఏటా వెయ్యి మంది మైనార్టీలను ఇలాగే కిడ్నాప్ చేసి, బలవంతంగా వాళ్ల మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు.
లాక్డౌన్లో మరీ ఎక్కువగా..
ఈ దారుణాలు లాక్డౌన్ సమయంలో మరీ ఎక్కువయ్యాయని అక్కడి మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఆడపిల్లలకు స్కూళ్లు లేకపోవడం, కుటుంబాలు అప్పుల పాలు కావడం, ఇంటర్నెట్లో పెళ్లి కూతుళ్ల కోసం చూసే వాళ్లు మరింత క్రియాశీలకంగా మారడంతో ఇవి ఎక్కువయ్యాయి. మత స్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఈ మధ్యే పాకిస్థాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది అమెరికా. హిందూ, క్రిస్టియన్, సిక్కు మైనార్టీ ఆడపిల్లలను కిడ్నాప్ చేసి, మతం మార్చి, బలవంతంగా పెళ్లి చేసుకొని, అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయని అమెరికా వెల్లడించింది.
హిందూ అమ్మాయిలే ఎక్కువ
ఇలా కిడ్నాప్, బలవంతపు మత మార్పిడులకు గురైన అమ్మాయిల్లో చాలా మంది సింధ్ ప్రావిన్స్‌లోని నిరుపేద హిందూ కుటుంబాలకు చెందినవాళ్లే. అయితే ఈ మధ్య క్రిస్టియన్ అమ్మాయిల కిడ్నాప్‌లు కూడా పెరిగిపోతున్నాయి. వీళ్లను చాలాసార్లు కిడ్నాప్ గ్యాంగ్‌లు, పెళ్లి కూతుళ్ల కోసం చూసేవాళ్లు, బంధువులే కిడ్నాప్ చేస్తున్నారు. కొన్నిసార్లు భూస్వాములే తమ అప్పులు తీర్చలేని కుటుంబాల నుంచి ఆడపిల్లలను ఎత్తుకెళ్తుంటారు. వీళ్ల మతం మార్చగానే ముసలి వాళ్లతో లేక వాళ్లను కిడ్నాప్ చేసిన వాళ్లతోనే పెళ్లిల్లు చేసేస్తుంటారని పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ చెబుతున్నది.
మత పెద్దలు, పోలీసుల సహకారం
ఇలా కిడ్నాప్ చేసి మత మార్చిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్న వారికి ఇస్లామిక్ మత పెద్దలు, మెజిస్ట్రేట్లు, స్థానిక పోలీసులు సహకరిస్తున్నారు. మత పెద్దలే దగ్గరుండి ఈ పెళ్లిళ్లు జరిపిస్తుండగా.. మెజిస్ట్రేట్లు వీటిని చట్టబద్ధం చేస్తున్నారు. ఇక తప్పిపోయిన అమ్మాయిల కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకుండా, దర్యాప్తు చేయకుండా పరోక్షంగా స్థానిక పోలీసులు కూడా ఈ మాఫియాకు సహకరిస్తున్నారు. పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగీ తిరిగీ అలసిపోయిన వాళ్లు ఇక తమ ఆడపిల్లలపై ఆశలు వదిలేసుకునే దుస్థితి అక్కడ నెలకొన్నది. సింధ్ ప్రావిన్స్ నుంచి 13 ఏళ్ల సోనియా కుమారిని ఇలాగే కిడ్నాప్ చేసి మతం మార్చి పెళ్లి కూడా జరిపించేశారు. తమ కూతురిని తిరిగి పంపించమని ఆమె తల్లి కాళ్లావేళ్లా పడ్డా ఫలితం లేకుండా పోయింది. సెంట్రల్ కరాచీ నుంచి 13 ఏళ్ల క్రిస్టియన్ అమ్మాయి అర్జూ రాజా కూడా ఇలాగే అదృశ్యమైంది. తమ అమ్మాయి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రెండు రోజుల తర్వాత ఆమె ఇస్లాం మతంలోకి మారినట్లు వాళ్లు సమాచారమిచ్చి చేతులు దులుపుకున్నారు. ఆమెను 40 ఏళ్ల ఓ ముస్లిం వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు ఆమె వయసును 19గా చూపించి పెళ్లిని చట్టబద్ధం చేయడం గమనార్హం.