శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Jan 17, 2020 , 03:58:37

భారత్‌ నిర్వహించే ఎస్సీవో సదస్సుకు ఇమ్రాన్‌కు ఆహ్వానం

భారత్‌ నిర్వహించే ఎస్సీవో సదస్సుకు ఇమ్రాన్‌కు ఆహ్వానం

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరిలో నిర్వహించనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) వార్షిక సదస్సుకు పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు ఇతర దేశాల అధినేతలను భారత్‌ ఆహ్వానించనున్నది. ఈ సదస్సుకు ఎస్సీవోలోని ఎనిమిది సభ్య దేశాలు, నాలుగు పరిశీలక దేశాలతోపాటు చర్చల భాగస్వామ్య (డైలాగ్‌ పార్టనర్‌) దేశాల ప్రతినిధులను ఆహ్వానించనున్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్‌ గురువారం మీడియాతో చెప్పారు.

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను కూడా ఆహ్వానిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నపై మరో అధికారి స్పందిస్తూ.. ‘అవును’ అని తెలిపారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేయడంతోపాటు ఆ రాష్ర్టాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత పాక్‌, భారత్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇమ్రాన్‌ఖాన్‌ను ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకోనున్నది. 


logo