శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Mar 08, 2020 , 02:39:36

మానవ చర్మంతో ఫొటో ఆల్బమ్‌లు!

మానవ చర్మంతో ఫొటో ఆల్బమ్‌లు!

కాలగర్భంలో కలిసిపోయాయనుకున్న కొన్ని విషయాలు వర్తమానంలో వెలుగులోకి వచ్చి గత జ్ఞాపకాల్ని నెత్తుటి ఆనవాళ్లతో గుర్తు చేస్తాయి. చరిత్ర మరువని క్రూర పశుప్రవృత్తికి నిదర్శనంగా అడాల్ఫ్‌ హిట్లర్‌ సృష్టించిన మారణకాండకు సజీవ సాక్ష్యాలు తరుచూ బయటపడుతూనే ఉన్నాయి. 1937లో హిట్లర్‌ నియంతృత్వ పాలన కొనసాగుతున్న దుర్భర సమయంలో జర్మనీలోని బుచెన్‌వాల్డ్‌లో ఏర్పాటుచేసిన ఓ నిర్బంధ కేంద్రంలో ఎనిమిదేండ్లపాటు సాగిన ఘోర కలి తాజాగా వెలుగులోకి వచ్చింది. మానవత్వానికి, మనుషుల ప్రాణానికి, దేహానికి ఎంతమాత్రం విలువనివ్వని ఆ అమానవీయ ఘటన నాజీల కాలంలో ఓ మహిళ కర్కశ పాశాణ హృదయానికి నిలువుటద్దంగా నిలిచింది.

  • హిట్లర్‌ పాలన నాటి అకృత్యాలు వెలుగులోకి
  • బందీలను చంపి వారి చర్మంతో పుస్తకాలు, ఆల్బమ్‌లు, టేబుల్‌ కవర్ల తయారీ
  • బుచెన్‌వాల్డ్‌ నిర్బంధ కేంద్రంలో ఘోరాలు

వార్సా(పోలండ్‌):చరిత్రకు సంబంధించిన అంశాలపై జిజ్ఞాస కలిగిన ఓ ఔత్సాహికుడు పోలండ్‌లోని ఓ రద్దీ మార్కెట్‌లో ఓ ఫొటో ఆల్బమ్‌ను కొనుగోలు చేశాడు. 1939-45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఫొటోలతో ఆ ఆల్బమ్‌ తయారైంది. అయితే, ఆ ఆల్బమ్‌ కవర్‌ పేజీపై మనిషి వెంట్రుక, టాటూ (పచ్చబొట్టు) ఉండటాన్ని అతను గుర్తించాడు. పైగా దాని నుంచి దుర్వాసన వస్తుండటంతో.. అనుమానం వచ్చి ఆ ఆల్బమ్‌ను ఔస్క్‌విట్జ్‌ మెమోరియల్‌ మ్యూజియం అధికారులకు అప్పగించాడు. దానిని పరిశీలించిన మ్యూజియం నిపుణులు.. మానవచర్మం తో సదరు ఆల్బమ్‌ను తయారు చేసినట్టు తేల్చారు. మరింత పరిశోధించి.. అలనాటి నాజీ నిర్బంధ కేంద్రం (కాన్సన్‌ట్రేషన్‌ క్యాంప్‌)లోని బందీలను చంపి.. వారి చర్మంతో దీనిని రూపొందిం చారని గుర్తించారు. రెండో ప్రపంచయుద్ధానికి కారకు డైన జర్మనీ నియంత హిట్లర్‌ పాలనకాలంలో జర్మనీలో జాత్యహంకారం పెచ్చరిల్లింది. ఆర్యులు అత్యున్నతులని.. దేశంలోని మైనార్టీవర్గమైన యూదుల వల్ల ఆర్యజాతి సంకరమవుతున్నదని, దేశంలోని సమస్య లన్నింటికీ వాళ్లే కారణమంటూ ఒక గుడ్డి ఉన్మాదాన్ని హిట్లర్‌కు చెందిన నాజీ పార్టీ రెచ్చగొట్టింది. 


ఈ ఉన్మాదం నేపథ్యంలో, యావత్‌ యూదుజాతినే నిర్మూలించాలని, హిట్లర్‌ ప్రభుత్వం భావించి.. దేశంలో నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలోకి యూదులను, ఇతర మైనార్టీలను పెద్ద ఎత్తున తరలించి చంపివేసేది. ఈ దారుణాలను వ్యతిరేకించిన కమ్యూనిస్టులు, నాస్తికులు, కార్మికసంఘాల నేతలు తదితరులను కూడా ఈ కేంద్రాలకు     తరలించి సామూహికంగా చంపేవారు. ఈ దారుణ మారణకాండలో దాదాపు కోటిన్నర మంది బందీల్ని చంపినట్లు అంచనా. హిట్లర్‌ ఏర్పాటు చేసిన నిర్బంధకేంద్రాల్లో మొదటిది బుచెన్‌వాల్డ్‌ క్యాంప్‌. ఈ కేంద్రంలోని బందీలను ఔషధ ప్రయోగాలకు, చిత్రహింసలకు గురిచేసి చంపే వారు. అయితే, ఇక్కడి బందీల చర్మంతో ఆల్బమ్‌లు కూడా తయారుచేసేంత క్రూరత్వానికి హిట్లర్‌ మూకలు దిగాయని ప్రపంచానికి ఇప్పుడే తెలిసింది. దీనిని మానవత్వంపై జరిగిన క్రూరమైన నేరంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.


మైనార్టీల ఊచకోత

యూదులు, ఇతర మైనార్టీలు, మతపరమైన, రాజకీయ ఖైదీలు,  స్వలింగ సంపర్కులు తదితరులను భారీ సంఖ్యలో బుచెన్‌వాల్డ్‌లోని శిబిరంలో బందీలుగా ఉంచేవారు. వీరిపై క్రూరమైన ఔషద ప్రయోగాలు జరిగేవి. 1937లో జర్మనీలోని వెయిమర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 2,50,000 మందికి పైగా పురుషులు, మహిళలు, పిల్లల్ని బంధించారు. బందీలు బయటకు పారిపోకుండా శిబిరం చుట్టూ ఉన్న గోడలకు కరెంటు తీగల్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 56 వేల మందిని చంపినట్లు సమాచారం. తిండిలేక, వ్యాధులు సోకి  అనేకమంది దయనీయ స్థితిలో ప్రాణాల్ని విడిచారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో శిబిరంలో ప్రాణాలతో ఉన్న వారికి విముక్తి లభించింది. ప్రాణాలతో బయటపడ్డ కొందరు బందీలు అక్కడి విషయాల్ని పంచుకున్నారు. బందీలను చంపి వారి చర్మంతో  పుస్తకాల బైండింగు, డబ్బులను దాచుకునే వాలెట్లు తయారు చేసేవారని చెప్పారు.


ఆడ రాక్షసి

బుచెన్‌వాల్డ్‌-నిర్భంధ కేంద్రానికి కమాండర్‌గా ఉన్న కార్ల్‌-ఒట్టో-కోచ్‌ భార్య ఇల్స్‌కోచ్‌. ఆమె అత్యంత క్రూరురాలు. ఇంటి అలంకరణపై ఆమెకు ఆసక్తి ఉండేది. ఇంట్లోని గదులు అందంగా కనిపించేందుకు నిర్భంధ కేంద్రంలోని బందీలను చంపి వాళ్ల చర్మాన్ని డిజైన్లుగా మార్చేవారు. బందీలపై టాటూలు వేయించి ప్రధానంగా దీనికోసం ఉపయోగించేవారు. ఇలా బందీల చర్మంతో పుస్తకాలు, ఆల్బమ్‌లు, టేబుల్‌ కవర్లను తయారు చేయించేవారు. చంపిన బందీల చేతి బొటనవేళ్లను పడకగదిలో బల్బులను(బెడ్‌ ల్యాంపులు) వెలిగించేందుకు, ఆర్పేందుకు కూడా ఆమె వాడేదని తాజాగా వెల్లడైంది. 


పాపం పండి ఆత్మహత్య

నాజీలకు వైద్యసేవలు అందించేందుకు అప్పట్లో ఎరిచ్‌ వాగ్నర్‌ అనే వైద్యుడు ఉండేవాడు. చంపిన బందీల చర్మాన్ని అతనికి అందించి అతని పీహెచ్‌డీ థీసిస్‌ కోసం ఇల్స్‌కోచ్‌ ‘సాయం’ చేసేది. దాదాపు వంద మంది బందీల చర్మంతో వాగ్నర్‌ కొన్ని బహుమతులను కూడా తయారు చేశాడు. వీరి అకృత్యాలు ఇలా కొనసాగుతుండగా.. రెండో ప్రపంచ యుద్ధం చివరి దశకు వచ్చింది. నిర్భంధ కేంద్రం ఉన్న ప్రాంతాన్ని అమెరికన్‌ సేనలు ఆధీనంలోకి తీసుకున్నాయి. దీంతో జర్మనీకి పారిపోయిన వాగ్నర్‌ అక్కడ మారుపేరుతో వైద్యుడిగా ప్రాక్టీసును కొనసాగించాడు. అయితే, 1958లో అతనెవరన్న విషయం తెలిసిపోయింది. ఆ మరుసటి ఏడాదే వాగ్నర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. నేరారోపణలు రుజువు రావడంతో జైలు జీవితం గడిపిన ఇల్స్‌కోచ్‌ కూడా 1967లో ఆత్మహత్య చేసుకున్నది. 


logo